వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు భరోసా

Assurance to varsity contract faculty Andhra Pradesh - Sakshi

కనీస టైమ్‌ స్కేల్‌ అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

కొన్ని వర్సిటీల్లో జీతాలు పెంచాం

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి స్పష్టీకరణ

గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ–24లో గందరగోళం.. జీఓ–40 ద్వారా ఎంటీఎస్‌ అమలుకు ప్రస్తుత సర్కారు చర్యలు

కొన్ని వర్సిటీల్లో కోర్టు కేసులవల్ల కూడా ఆటంకం

కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎవరినీ తొలగించం..: సతీష్‌చంద్ర

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మినిమమ్‌ టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరంలేదని, దీనిపై మంత్రుల బృందం చర్చిస్తోందని తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం ఆయనతోపాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 2019 ఎన్నికల వేళ ఇచ్చిన జీఓ–24లోని అంశాల్లో నెలకొన్న గందరగోళంతోనే వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్‌ అమలులో జాప్యం జరుగుతోందని హేమచంద్రారెడ్డి వివరించారు.

కాంట్రాక్టు అధ్యాపకులను మభ్యపెట్టేందుకే ఆ సర్కారు జీఓ 24ను ఇచ్చిందన్నారు. అంతేకాక.. ‘గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టు అధ్యాపకుల గురించి అస్సలు పట్టించుకోలేదు. 2015 సవరించిన పే స్కేల్స్‌ ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్‌ ఇవ్వాలని జీఓలో పేర్కొనడంవల్లే వారికి దాని అమలులో ఆటంకం ఏర్పడింది. వర్సిటీ అధ్యాపకులకు రాష్ట్ర రివైజ్డ్‌ పే స్కేళ్లు వర్తించవు. వారికి యూజీసీ రివైజ్డ్‌ పే స్కేళ్లు వర్తిస్తాయి. అయినా.. నాటి ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా జీఓ ఇచ్చింది’.. అని హేమచంద్రారెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో.. కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్‌ ఎలా వర్తింపజేయాలనే దానిపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు.

ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం జీఓ–40 తీసుకొచ్చిందన్నారు. జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఎంటీఎస్‌ సక్రమంగా అమలుచేస్తున్నప్పటికీ యూనివర్సిటీ స్థాయిలో అమలుచేయడం లేదంటూ వస్తున్న వార్తలలో వాస్తవంలేదని ఆయన కొట్టిపారేశారు. గతంలో యూనివర్సిటీల్లో జరిగిన నియామకాల్లో ఒక క్రమపద్ధతి పాటించకపోవడంవల్లే ఇప్పుడు  సమస్యలు తలెత్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఆర్థికశాఖ అనుమతిలేకుండా నియామకాలు చేశారని.. కనీసం నోటిఫికేషన్‌ ఇవ్వడం, రిజర్వేషన్లను, రోస్టర్‌ పాయింట్లను పాటించడం వంటి నిబంధనలు పట్టించుకోలేదన్నారు.

ఇక రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల్లో ప్రస్తుతం 2,100 కాంట్రాక్టు అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్నారని.. వీరిలో నిబంధనల ప్రకారం నియమితులైన వారెంతమంది? నోటిఫికేషన్‌ లేకుండా నియమితులైన వారెంతమంది అన్నదానిపై వర్సిటీల్లో స్పష్టతలేకపోవడం ఎంటీఎస్‌ అమలుకు ఆటంకంగా ఉందన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని, వర్సిటీల్లో అలా జరగకపోవడంవల్ల ఇబ్బంది అవుతోందని హేమచంద్రారెడ్డి వివరించారు. ‘అయినప్పటికీ కొన్ని వర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదికవి నన్నయ్య, జేఎన్టీయూ (కాకినాడ), జేఎన్టీయూ (అనంతపురం), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ఇప్పటికే 40వేల వరకూ వేతనాలు పెంచాం. అన్నిచోట్ల ఒకే విధంగా వేతనం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

కేసులతోనే ఎంటీఎస్‌ అమలులో సమస్యలు
ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మాట్లాడుతూ.. కనీస టైం స్కేల్‌ అమలు విషయంలో కొన్ని వర్సిటీల్లోని కొంతమంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందన్నారు. ఇటీవల ఎయిడెడ్‌ కాలేజీల్లోని ఎయిడెడ్‌ సిబ్బందిని వర్సిటీల్లో నియమించడం ద్వారా వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తారంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఏ ఒక్క కాంటాక్టు అధ్యాపకుడినీ, ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించబోదని ఆయన స్పష్టంచేశారు. ఎయిడెడ్‌ అధ్యాపకులు 700–800 మంది ఉన్నారని, వారిలో 300 మంది మాత్రమే యూనివర్సిటీలకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. వారిని నియమించినా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమన్నారు. 

వచ్చే ఏడాది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం
ఇక ప్రభుత్వ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. వచ్చే ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం 2000 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం చేయనుందని సతీష్‌చంద్ర వెల్లడించారు. వర్సిటీ కాంట్రాకు అధ్యాపకులకు ఇది మంచి అవకాశమన్నారు. ఏపీపీఎస్సీ రాతపరీక్ష ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని చెప్పారు. నిజానికి.. కాంట్రాక్టు అధ్యాపకులను, ఉద్యోగులను రెగ్యులర్‌ చేసే అధికారం రాష్ట్రాలకులేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులిచ్చిందని ఆయన చెప్పారు. అంతేకాక.. 1994లో తెచ్చిన చట్టం ప్రకారం కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసే అవకాశంలేదన్నారు.

గతంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం జరిగేది కాదని.. ప్రస్తుత ప్రభుత్వం వారికి అనేక రకాలుగా మేలు చేస్తోందని సతీష్‌చంద్ర వివరించారు. అప్పట్లో ఏజెన్సీల ద్వారా జరిగే నియామకాల్లో అవినీతి జరిగేదని, జీతాలు కూడా కోతపెట్టేవారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌కు కార్పొరేషన్‌ను (ఆప్కాస్‌) ఏర్పాటుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐతో కూడిన వేతనాలను సమయానికి ఇస్తోందన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వానిదేనని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సతీష్‌చంద్ర భరోసా ఇచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top