అధిక దిగుబడికి చేయూత | Assistance to farmers under the name of Cluster Demos | Sakshi
Sakshi News home page

అధిక దిగుబడికి చేయూత

Oct 11 2020 4:36 AM | Updated on Oct 11 2020 4:36 AM

Assistance to farmers under the name of Cluster Demos - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ ఆహార భద్రతా మిషన్‌ కింద రాష్ట్రంలోని వెనుకబడిన, దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న క్లస్టర్‌ గ్రూపు రైతులకు ఉత్పాదకాలు కొనుగోలు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ ఆర్థిక సాయం అందజేస్తోంది. క్లస్టర్‌ డెమోస్‌ పేరిట రాష్ట్ర వ్యవసాయ శాఖ సుమారు 20 వేల ఎకరాల్లో అధికోత్పత్తి సాగు పద్ధతులను రైతులకు నేర్పుతోంది. ఈ కృషిలో తాము సైతం అంటూ కొన్ని పెద్ద పురుగు మందుల, సూక్ష్మ పోషకాల తయారీ సంస్థలు, మొక్కల సంరక్షణ సంస్థలు ముందుకు వచ్చాయి.

ఏమిటీ క్లస్టర్‌ సాగు?
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దిగుబడి తక్కువగా వస్తోంది. దీన్ని పెంచడానికి జాతీయ ఆహార భద్రతా మిషన్‌ కింద ‘క్లస్టర్‌ డెమోస్‌’ అనే పథకాన్ని ప్రారంభించారు. 50 ఎకరాలను ఒక్కో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి మొత్తం 20వేల ఎకరాల్లో ఐదారు రకాల పంటల్ని అధికోత్పత్తి వచ్చేలా రైతులతో సాగు చేయిస్తున్నారు. ఇందుకు కోసం రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఎరువులు, మేలైన విత్తనాలు, సూక్ష్మ పోషకాలతో పాటు రాయితీపై చిన్న యంత్రాలనూ సరఫరా చేస్తున్నారు. 

క్లస్టర్ల సేవలో ఎంఎన్‌సీలు..
అధికోత్పత్తికి పాటుపడుతున్న రైతులకు తమ వంతు సాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు కొన్ని బహుళ జాతి కంపెనీ(ఎంఎన్‌సీ)లు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థలు తయారు చేసే పురుగు మందులు, సూక్ష్మపోషకాలు వంటి వాటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించాయి. ముందుకు వచ్చిన సంస్థల్లో బేయర్‌ క్రాప్‌ సైన్స్, వెల్‌ఆగ్రో, మహాధన్, సల్ఫర్‌ మిల్స్, ఇండోఫిల్‌ ఇండస్ట్రీస్, స్వాల్‌ కార్పొరేషన్, కోరమాండల్‌ ఇంటర్నేషనల్, సుదర్శన్‌ ఫార్మ్‌ కెమికల్స్, ఇన్‌సెక్టిసైడ్‌ ఇండియా, నిచినో ఇండియా, యూపీఎల్‌ లిమిటెడ్, క్రిస్టల్‌ కార్పొరేషన్‌ ప్రొటెక్షన్, పారిజాత ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మార్గో బయో కంట్రోల్స్, సుమిత్రో కెమికల్స్, కోర్టెవా అగ్రీ సైన్స్‌ తదితరాలు ఉన్నాయి. 

ప్రభుత్వ సాయానికి ఎంఎన్‌సీల తోడ్పాటు
హెక్టార్‌కు రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు.. ఈ తరహా రైతులందర్నీ ఒక గ్రూపుగా తయారు చేసి ప్రభుత్వం సాయం అందిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్కో ఎంఎన్‌సీ ఒక్కో ప్రాంతంలో సాగు చేసే పంటలకు అవి తయారు చేసే మందుల్ని రైతులకు ఉచితంగా అందజేసేందుకు ముందుకువచ్చాయి.
– హెచ్‌.అరుణ్‌కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement