AP: ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా ఆర్టీసీ

APSRTC Towards Financial Self Sufficiency - Sakshi

5 నుంచి 15 ఏళ్ల వరకు లీజుకు ఆర్టీసీ స్థలాలు

బీవోటీ విధానంలో ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం

మున్సిపల్, మండల కేంద్రాల్లో 48 స్థలాలకు టెండర్లు

వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పూర్తి కానున్న టెండర్ల ప్రక్రియ

సాక్షి, అమరావతి: వనరుల సద్వినియోగం ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధన దిశగా ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో విలువైన స్థలాల్లో ‘నిర్మించు–నిర్వహించు–బదలాయించు(బీవోటీ) విధానంలో ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లోని ఆర్టీసీ స్థలాలను కూడా లీజుకు ఇవ్వాలని, ఆ స్థలాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది.
చదవండి: ఏపీ రైతులకు అలర్ట్‌.. ఈ నెల 12 వరకే గడువు..

మొదటి దశలో 48 కేంద్రాల్లో స్థలాలను లీజుకు ఇవ్వనుంది. రాష్ట్రంలో నాలుగు జోన్ల పరిధిలోని మొత్తం 1,98,393 చ.గజాల విస్తీర్ణంలోని స్థలాలను ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల కాలపరివిుతికి ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి జోన్‌ పరిధిలో 14 కేంద్రాల్లో 38,188 చ.గజాలు, రెండో జోన్‌ పరిధిలో 10 కేంద్రాల్లో 21,125 చ.గజాలు, మూడో జోన్‌ పరిధిలో 11 కేంద్రాల్లో 33,326 చ.గజాలు, నాలుగో జోన్‌ పరిధిలో 13 కేంద్రాల్లో 1,05,754 చ.గజాల స్థలాలు ఉన్నాయి.

వాటిలో కనిష్టంగా 250 చ.గజాల నుంచి గరిష్టంగా 15,500 చ.గజాల స్థలాల వరకు ఉండటం విశేషం. ఆ స్థలాల్లో జి+1 విధానంలో వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతిస్తారు. లీజు కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ సముదాయాలు ఆర్టీసీ సొంతమవుతాయి. ఈ స్థలాల లీజుకు సంబంధించి ఆయా జోన్ల వారీగా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top