ముందు భూమి తీసుకో.. డబ్బు ఉన్నప్పుడు కట్టు | APIIC revises land allotment rules | Sakshi
Sakshi News home page

ముందు భూమి తీసుకో.. డబ్బు ఉన్నప్పుడు కట్టు

Apr 4 2026 5:02 AM | Updated on Apr 4 2026 5:02 AM

APIIC revises land allotment rules

భూ కేటాయింపుల నిబంధనలు సవరించిన ఏపీఐఐసీ

సాక్షి, అమరావతి: విలువైన భూమి కేటాయించిన తర్వాత సకాలంలో మొత్తం నగదు కట్టకపోయినా ఉన్నప్పుడు కట్టుకునే అవకాశాన్ని ఏపీఐఐసీ కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం భూమి కేటాయించిన తర్వాత 60 రోజుల్లోగా నిర్దేశిత మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి. ఆ నిబంధనను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 60 రోజులు దాటిన తర్వాత 9 శాతం వడ్డీతో ఎప్పుడైనా డబ్బు చెల్లించే వెసులుబాటు కల్పించింది. అంటే 61వ రోజు నుంచి ఎప్పుడు చెల్లిస్తారో అన్ని రోజులకు 9 శాతం వడ్డీ చెల్లించడంతోపాటు 3 శాతం అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

అదే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలైతే 8 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తుల  మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువరాజ్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ  సడలింపు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవడానికి అనుమతిస్తామని, 2020 నిబంధనల ప్రకారం కేటాయించిన భూములకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. 

ఇప్పటికే విశాఖలో భూములు కేటాయించిన బెంగళూరుకు చెందిన సత్వా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి రూ.1500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని రూ.45 కోట్లకే కేటాయిస్తే సకాలంలో డబ్బులు చెల్లించలేదు.  మంత్రివర్గంలో మరోసారి అనుమతి తీసుకొని డబ్బులు చెల్లించింది. ఇదే విధంగా ప్రీమియర్‌ ఎక్స్‌పో్లజివ్‌ సంస్థ కూడా సకాలంలో డబ్బులు చెల్లించలేక గడువు అడిగింది. ఇలా ఈ మధ్యకాలంలో చంద్రబాబు సర్కారు కారు చౌకగా భూములు కేటాయించిన పలు సంస్థలు నిర్దేశిత సమయంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆ నిబంధనలనే సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement