తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా

AP Prakasam Historical village Kanuparthi Care Of Address For Soldiers - Sakshi

అవి ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులు. ఉప్పు మీద ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సమయంలో ఆంగ్లేయులు మనవాళ్లనే రక్షణ కోసం వాడుకున్నారు. 18 ఏళ్లు దాటి ధృడంగా ఉన్న యువకులను మిలిటరీ, ఉప్పు కొఠార్లు వద్ద జవాన్లుగా ఎంపిక చేశారు. ఆ నాడు అలా రక్షణ కోసం పడిన అడుగులు నేడు దేశ భక్తి వైపు నడిపించాయి. చిత్రమేమిటంటే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా ఈ కొలువులు చేస్తున్న వారి ఇంటిపేరు ‘తుపాకుల’. దశాబ్దాలుగా దేశ రక్షణ వ్యవస్థలోనే అనేక విభాగాల్లో తుపాకుల వంశీయులు స్థిరపడి సేవలందిస్తున్నారు.ఆ వంశీయులే కాకుండా.. వారి అల్లుళ్లు సైతం ఇవే వ్యవస్థల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశ సరిహద్దుల్లోని ప్రతి బెటాలియన్‌లో తారసపడతారు. ఇంటి పేరును ఆయుధంగా మార్చుకుని వందలాది మంది తుపాకులు చేతపట్టారు. ‘తుపాకుల’ వంశం వివరాలు, వీరి దేశభక్తిని తెలుసుకుందామా మరి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సముద్ర తీరప్రాంత గ్రామం కనపర్తి. దీనికి చారిత్రాత్మక గుర్తింపు ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కనకపురి పట్టణం అనేవారు. కార్తవ రాయుడు పాలించిన గడ్డ ఇది. ముత్యాలు, వజ్రాలు, రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేవారని పూరీ్వకుల కథనం. ఇక్కడ పురావస్తు ఆనవాళ్లకు గుర్తుగా నంది విగ్రహాలు, బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంపై బ్రిటీష్‌ వాళ్ల కళ్లు పడ్డాయి. కనపర్తి, పెదగంజాం, దేవరంపాడు ప్రాంతాల్లో ఉప్పు పండించేవారు బ్రిటీష్‌ పాలకులు. బకింగ్‌ హాం కెనాల్‌ నుంచి ఉప్పును తమ దేశానికి తరలించే వారు.

ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఆ తర్వాత కనపర్తికి పక్కనే ఉన్న దేవరంపాడులో నిర్వహించిన ఉప్పు సత్రాగ్రహానికి మహాత్మా గాంధీ వచ్చి స్వాతంత్య్ర సమర యోధులకు మద్దతు పలికారు కూడా. తమకు రక్షణగా ఉన్న బెటాలియన్‌లోకి, ఉప్పు పొలాల వద్ద రక్షణగా పనిచేసేందుకు స్థానికంగా ఉన్న తుపాకుల వంశీయులను గార్డులుగా నియమించుకున్నారు. వీరు దృఢంగా, భారీ కాయులుగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా ఆ కొలువుల్లోకి తీసుకునేవారు. మరికొందర్ని బలవంతంగా బ్రిటీష్‌ మిలిటరీలోకి తీసుకెళ్లారు. బ్రిటీష్‌ హయాంలో కనపర్తిలో సాల్ట్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం కూడా ఉంది. ఆ సాల్ట్‌ కార్యాలయానికి ఎదురుగానే బ్రిటీష పోలీస్‌ క్వార్టర్స్‌ కూడా ఉండేవి. పోలీస్‌ క్వార్టర్స్‌ ప్రస్తుతం శిథిలమైపోయాయి. సాల్ట్‌ కార్యాలయం కూడా అవసాన దశకు చేరుకుంది.  

మిలిటరీ వాళ్లకు పెట్టింది పేరు కనపర్తి పెద్ద ఊరు
కనపర్తి తోపు తొలుత మిలిటరీ, ఆ తర్వాత పోలీస్, కాలక్రమేణా ఇతర యూనిఫాం విభాగాల్లో సేవలు అందిస్తే.. కనపర్తి పెద్ద ఊరు మాత్రం మిలిటరీ ఉద్యోగాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం 150 మందికిపైగా దేశ సేవలో పునీతులవుతున్నారంటే ఆ ఉద్యోగాలంటే ఎంత మక్కువో అర్థమవుతోంది. ఆ గ్రామం నుంచి నలుగురు మిలిటరీలో కెపె్టన్లుగా పదవీ విరమణ చేసిన వారున్నారు. వారిలో తుపాకుల వంశీయులతో కలిసి పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా, చైనా యుద్ధాల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. పులుగు వెంకటేశ్వరరెడ్డి, కుక్కల వెంకటేశ్వరరెడ్డి కెపె్టన్లుగా పనిచేశారు. వారు కాలక్రమేణా వయస్సు రీత్యా మృతి చెందారు. ఇకపోతే 33 సంవత్సరాల పాటు సేవలందించిన కుక్కల శివారెడ్డి, సూరిబోయిన వెంకటప్పలనాయుడు కూడా కెపె్టన్లుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు.  

మిలిటరీలో తొలి అడుగుతుపాకుల చెన్నయ్య ఆయన సోదరులు
1930 సంవత్సరానికి ముందు తుపాకుల చెన్నయ్య మొదటిసారిగా బ్రిటీష్‌ మిలిటరీలోకి వెళ్లారు. వాళ్లు నలుగురు సోదరులు. వాళ్లందరూ కూడా మిలిటరీలో దేశానికి సేవచేసిన వారే. తర్వాత ఆయన సంతానం పెద చెన్నయ్య, సోమయ్య, బంగారయ్యలు పోలీసులుగా విధులు నిర్వర్తించారు. ఆయనకు నలుగురు సంతానంలో తుపాకుల సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు, వీర రాఘవయ్యలు. వీళ్లందరూ కూడా పోలీసులే. ఈ నలుగురు సంతానంలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు మొదలుకుని ఎనిమిది మంది వరకు పోలీసులుగా ప్రజలకు సేవలు అందించారు.  

ప్రతి ఇంట్లో పోలీసులే... 
కనపర్తి తోపు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో పోలీసులే కనపడతారు. తుపాకులతో పాటు ఆవుల, బొజ్జా అనే ఇంటిపేరు వారు కూడా తుపాకుల వారితో పోటీ పడి మరీ పోలీసులతో పాటు ఎక్సైజ్, సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ ఇలా యూనిఫాం విభాగాల్లోనే సేవలు అందించారు. కానిస్టేబుల్‌ మొదలుకుని ఏఎస్పీ వరకు అన్ని హోదాల్లో పనిచేసిన వారు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో ఎనిమిది వందల గడపలు ఉంటే యూనిఫాం లేని ఇల్లు ఉండదు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరంలోనైనా, ఏ జిల్లా కేంద్రంలోనైనా తుపాకుల ఇంటి పేరు ఉన్న వారు పోలీసు కొలువుల్లో కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా 

పోలీస్‌ విభాగంలో ఉత్సాహంగా చేరాం 
నేను చిన్నతనంలో ఊరికి మిలిటరీ, పోలీస్‌ డ్రెస్సులు వేసుకుని బంధువులు వస్తుండేవారు. అది చూసి చిన్నప్పటి నుంచి పోలీస్‌ కావాలన్న ఆశ ఎక్కువగా ఉండేది. మా ముత్తాతలు మిలిటరీలో పనిచేశారు. ఆ తర్వాత మా తాతలు నలుగురు పోలీసులే. మా నాన్న వీరరాఘవయ్య పోలీస్‌ విభాగంలో పనిచేశారు. మా పెదనాన్నలు సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు కూడా పోలీస్‌ విభాగాల్లోనే పనిచేశారు. మా పెదనాన్నల కుమారులు, మా అన్నదమ్ములు పోలీస్‌ విభాగాల్లోనే పనిచేశారు. నేను ఎక్సైజ్‌ సెలక్షన్స్‌కు వెళ్లాను. మొదటి ప్రయత్నంలోనే ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఎక్సైజ్‌ విభాగంలో ఏడాదిన్నర క్రితం ఎస్సైగా పదవీ విరమణ పొందాను. మా ఇంటి ఆడపిల్లల్ని అందరినీ పోలీస్‌ విభాగంలో పనిచేసిన వారికే ఇచ్చారు మా తల్లిదండ్రులు. అందరం సంతోషంగా ఉన్నాం.  
– తుపాకుల చెన్నకేశవరావు, రిటైర్డ్‌ ఎస్సై, ఎక్సైజ్‌ విభాగం  

ఏఎస్పీలుగా ముగ్గురు పదవీ విరమణ
కనపర్తి గ్రామానికి చెందిన వారిలో ముగ్గురు ఏఎస్పీలుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. వారిలో తుపాకుల రామకృష్ణ ఏఎస్పీగా రిటైరై తెనాలిలో కుటుంబంతో స్థిరపడ్డారు. మరొకరు తుపాకుల వెంకటేశ్వరరావు ఏఎస్పీగా రిటైరై గుంటూరులో ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇంకొకరు ఆవుల సుబ్బారావు ఏఎస్పీగా రిటైరై కాకినాడలో స్థిరపడగా, తుపాకుల మురళీకృష్ణ డీవైఎస్పీగా తిరుపతిలో పనిచేస్తున్నారు. ఇక సీఐ, ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అటు పోలీస్, ఇటు ఎౖజ్, సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. యూనిఫాం విభాగాలు కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా పనిచేసిన, చేస్తున్న వారు కూడా ఉన్నారు.

ఆడపిల్లలను పోలీసులకే ఇచ్చి వివాహం 
మొదటి నుంచి తుపాకుల వంశీయులు మిలిటరీ, పోలీస్‌ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి ఇంటి ఆడపడుచులను కూడా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారికే ఇచ్చి సంబంధాలు కలుపుకున్నారు. ఆ విధంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు యూనిఫాంలు ధరించే వారితో కలర్‌ఫుల్‌గా ఉండటాన్ని వారు కూడా స్వాగతించారు.  

మా వంశం మొత్తం మిలిటరీ, పోలీసులుగానే 
మా వంశం మొత్తం మిలిటరీ, పోలీస్‌ విభాగాల్లోనే పనిచేశారు. మా ముత్తాత కూడా మిలిటరీలో పనిచేశారని మా తాత చెప్పేవారు. మా తాత రాఘవయ్య బ్రిటీష్‌ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. మా నాన్న కోటయ్య 1939లో బ్రిటీష్‌ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అర్హతను బట్టి మిలిటరీలోకి, పోలీస్‌ విభాగంలోకి, ఎక్సైజ్‌ విభాగంలోకి వేరే ఇతర విభాగాల్లోకి పంపించారు. నేను పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి   2010లో పదవీ విరమణ పొందాను.  
– బొజ్జా కృష్ణమూర్తి, రిటైర్డ్‌ ఏఎస్సై, పోలీస్‌ విభాగం   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top