తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి

AP Govt Affidavit In NGT‌ Against Telangana Over Pothireddypadu Videos - Sakshi

అవి ‘పోతిరెడ్డిపాడు’ వీడియోలు

ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌

విచారణ మంగళవారానికి వాయిదా 

సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడి రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు చేపడుతున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ఆధారాలతో ఎన్జీటీని తప్పుదోవ పట్టిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. సృష్టించిన (ఫ్యాబ్రికేటెడ్‌) ఆధారాలతో వీడియోలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్‌ 192 మేరకు క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల వద్ద పనులు చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్‌ పిటిషన్లకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయిన విషయం విదితమే. కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి ఎన్జీటీకి అధికారం ఉందా అనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్‌ పిటిషన్‌లో ప్రస్తావించింది.

అనంతరం ఎన్జీటీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. ఆయా పిటిషన్లను గురువారం జస్టిస్‌ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ మాధురి దొంతిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద చేపడుతున్న పనులు, సర్వే.. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల మేరకు రూపొందిస్తున్న డీపీఆర్‌కు సంబంధించినవి మాత్రమేనని తెలిపారు.

ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల వద్ద పరిశీలించిన కృష్ణాబోర్డు గతనెల 13న, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈనెల 8న ఎన్జీటీకి సమర్పించిన నివేదికల్లో.. ప్రాజెక్టు పరిసరాల్లో ఎలాంటి పనులు కొనసాగడంలేదని స్పష్టం చేశాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు సంబంధించి జరుగుతున్న పనులను రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద జరుగుతున్న పనులుగా వీడియో క్లిప్పింగ్‌లు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. గవినోళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో కల్పించుకున్న ధర్మాసనం..ట్రిబ్యునల్‌ తీర్పులు అమలు కాకపోతే చూస్తూ ఉండాలా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని గవినోళ్ల శ్రీనివాస్‌ న్యాయవాది శ్రావణ్‌కుమార్, తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు తెలిపారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top