ఆదాయ వనరుల పెంపుపై ఏపీ సర్కార్‌ దృష్టి

AP Government Is Focused On Raising Revenue Sources - Sakshi

లాక్‌డౌన్, నియంత్రణ చర్యలతో స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై గణనీయ ప్రభావం

ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి

అనవసర వ్యయాన్ని తగ్గించి.. ఆర్థిక వనరుల సమర్థ వినియోగానికి సీఎస్‌ నేతృత్వంలో కమిటీ

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 లాక్‌డౌన్, నియంత్రణ చర్యలతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ఆదాయ వనరులు పెంచుకోవడం, ఉన్న ఆదాయ వనరుల సమర్థ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు అనవసర వ్యయాన్ని అరికట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక వనరుల సమర్థ వినియోగానికి వీలుగా ప్రస్తుత విధానంపై సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ అధ్యక్షతన అధికారుల కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది.

నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలు
కోవిడ్‌ నివారణ, నియంత్రణకు కఠినమైన లాక్‌డౌన్‌ విధించడంతో నెలల తరబడి ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో పన్ను ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ తగ్గి ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్న క్రమంలో ఫిబ్రవరి నుంచి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. ఇప్పుడు కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ కూడా పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో వీలైనంత మేర ప్రాణహాని తగ్గించడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. లాక్‌డౌన్, ఆంక్షలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రభుత్వ సేవలు, కార్యక్రమాల అమలును సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది.

తద్వారా వీలైనంత మేర వనరులసు సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ అధ్యక్షతన.. చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ), ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన (సర్వీసెస్‌) ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (ఎస్‌ఆర్‌) ముఖ్య కార్యదర్శి సభ్యులుగా, ఆర్థిక శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు..
ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రజలకు అందించే సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు, కార్యాచరణ సామర్థ్యం పెంచేందుకు అవసరమైన చర్యలను గుర్తించాలి. 
అందుబాటులో ఉన్న ఆదాయాలను అంచనా వేసి.. వాటి ఆధారంగా ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడానికి తగిన సూచనలు చేయాలి. తద్వారా ఉన్న ఆర్థిక వనరులను ఉత్పాదక రంగాలపై వెచ్చించడానికి చర్యలను సూచించాలి.
రాష్ట్ర ఆదాయం పెంచడానికి సమగ్ర చర్యలతో కూడిన జాబితాను రూపొందించి తగిన సూచనలు చేయాలి.

పన్ను ఎగవేతలను నిరోధించేందుకు మరింత మెరుగైన పరిపాలన సమన్వయం, పర్యవేక్షణ కోసం విధానపరమైన చర్యలతోపాటు చట్ట సవరణలకు సూచనలు చేయాలి.
ప్రజాధనాన్ని మెరుగైన ఉత్పాదనలపై వెచ్చించడం ద్వారా మంచి ఫలితాలు సాధించడానికి.. అనవసర, నివారించగల వ్యయాలను గుర్తించి.. తగిన చర్యలను సూచించాలి.
డూప్లికేషన్‌ వ్యయాన్ని నివారించడంతోపాటు వృథాను అరికట్టేందుకు శాఖాపరమైన పునర్వ్యవస్థీకరణలను గుర్తించాలి.  
ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించడం, వీలైనంత మేర వ్యయాన్ని తగ్గించడం, ఆదాయం పెంచడంపై కమిటీ ప్రతి శాఖ, విభాగాలను సమీక్షించాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top