Andhra Pradesh: ఇంటింటా ఫీవర్‌ సర్వే 

AP Government Conduct Door To Door Fever Survey Across State - Sakshi

సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఓవైపు.. కర్ఫ్యూ అమలు చేస్తూనే, అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు సకాలంలో దేశీయంగా లభించనందున వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు వేగవంతం చేసేలా అడుగులు వేస్తోంది. అదే విధంగా.. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయాలను అన్వేషించి ఆక్సిజన్‌ నిల్వలను పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదనపు ఆక్సిజన్‌ను జిల్లాల్లో అత్యవసరాల కోసం నిల్వ చేస్తామని  వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఇప్పటికే వెల్లడించారు. 

ఇక పెద్ద ఎత్తున కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తోన్న ప్రభుత్వం.. శనివారం నుంచి జ్వరాలపై ఇంటింటి సర్వే ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంటింటి సర్వేపై దిశా నిర్ధేశం చేశారు. సర్వేలో భాగంగా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి జ్వరపీడితులను గుర్తిస్తారు. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలుంటే ఆ విషయాన్ని సంబంధిత ఏన్‌ఎన్‌ఎంకు తెలియజేస్తారు. 

అంతేకాకుండా వివరాలను ఎప్పటికప్పుడు వలంటీర్ల యాప్‌లోనూ అప్‌లోడ్‌ చేస్తారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని అవసరాన్ని బట్టి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో గానీ, ఆస్పత్రిలో గానీ చేర్పిస్తారు. కరోనా లక్షణాలేవీ లేని వారిని, ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారిని, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారిని 14 రోజుల వరకు హోం క్వారంటైన్‌లో ఉంచుతారు. వారికి అవసరమైన మందుల కిట్‌ ఇచ్చి ఏఎన్‌ఎం ద్వారా పర్యవేక్షణ చేయస్తారు. జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేయనున్నారు. దీనివల్ల కరోనాను కట్టడి చేయడమే కాక, ఆస్పత్రులపై ఒత్తడి కూడా తగ్గనుంది.  

చదవండి: కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top