
వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం చేస్తూ కేబినెట్ నిర్ణయం
ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి ఉన్న అనధికార భవన నిర్మాణాల రెగ్యులైజేషన్
ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇసుక తీసుకోవడానికి బదులు డీసిల్టింగ్‌గా మార్పు
సాగునీటి సంఘాలకు నామినేషన్‌పై పనులు రూ.10 లక్షల వరకు పెంపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ ఆధ్వర్యం నుంచి తప్పించి ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకోగా, మరోవైపు 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో పది వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.
అనధికార భవనాల రెగ్యులరైజేషన్, తాగునీటి ప్రాజెక్టులు, పథకాల నిర్వహణపై కొత్త విధివిధానాలకు ఆమోదం తెలిపింది. సాగునీటి వినియోగదారుల సంఘాలకు నామినేషన్‌పై పనులను రూ.10 లక్షల వరకు పెంచుతూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
⇒ ఆయుష్మాన్ భారత్–పీఎంజెఏవై–ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద హైబ్రీడ్ విధానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు ఆర్‌ఎఫ్‌పీకి ఆమోదం. ఏడాదికి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు వైద్య చికిత్సలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానే అందిస్తారు. రూ.2.5 లక్షలకుపైబడి రూ.25 లక్షల వరకు వైద్య చికిత్సలను ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ చేస్తే ఆ మొత్తాన్ని ఆ కంపెనీలకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ రీయింబర్స్‌మెంట్ చేస్తుంది.
ఎంప్లాయి హెల్త్ స్కీమ్‌దారులకు మినహా రాష్ట్రంలో మిగతా అన్ని కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. పేషెంట్ చేరిన ఆరు గంటల్లోగా ఆమోదం లభించడంతోపాటు క్లెయిమ్‌లను 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలి. పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు అందజేస్తారు. అమలు తీరును పర్యవేక్షించేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కంట్రోల్ రూమును ఏర్పాటు చేస్తారు.
⇒ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో రెండు దశల్లో చేపట్టేందుకు రూపొందించిన ఆర్‌ఎఫ్‌పీకి ఆమోదం. రాయితీ ఒప్పందాలు ఖరారు చేసిన వెంటనే ప్రీ–బిడ్ సంప్రదింపులు ఆధారంగా ఆర్‌ఎఫ్‌పీలో మార్పులు చేయడానికి టెండర్ కమిటీని అనుమతించేందుకు ఆమోదం. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో 10 వైద్య కళాశాలలను పీపీపీలో చేపడతారు.
ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలను తొలి దశలో చేపడతారు. మిగతా ఆరు మెడికల్ కాలేజీలను రెండో దశలో చేపడతారు. 2027–28 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు జరిగే విధంగా ఈ కళాశాలల నిర్మాణాలను పూర్తి చేస్తారు.
⇒ పట్టణాలు, నగరాల్లో 31–08–2025 నాటికి ఉన్న అనధికార భవన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసేందుకు ఆమోదం. ఇక నుంచి అనధికార భవనాలను ప్రారంభ దశలోనే కూల్చివేయాలని నిర్ణయం. ఎత్తయిన నివాస భవనాల గరిష్ట ఎత్తు పరిమితిని 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం.

⇒ కృష్ణా నది వివిధ రీచ్‌లు, ప్రకాశం బ్యారేజీ ముందు నుంచి ఇసుక తీసుకోవడానికి ఎన్‌జీటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇసుక అనే పదానికి బదులు డీసిల్టింగ్ అనే పదం చేర్చేందుకు ఆమోదం.
⇒ సాగునీటి వినియోగ సంఘాలకు గుర్రపుడెక్క, కలుపు తొలగింపు పనులను రూ.5 లక్షల వరకు నామినేషన్‌పై ఇస్తుండగా, ఇప్పుడు రూ.10 లక్షల వరకు నామినేషన్‌పై ఇచ్చేందుకు ఆమోదం.
⇒ రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు వీలుగా 2016 చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
⇒ మూడో పార్టీ ఆక్రమణల్లో ఉన్న 347 వ్యక్తులకు సంబంధించిన అదనపు భూముల క్రమబద్ధీకరణ, కేటాయింపులకు ఆమోదం.
⇒ దీపం–2 పథకం కింద అర్హత కలిగిన 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లను 14.2 కిలోల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్లుగా మార్చేందుకు ఆమోదం.