కర్నూలు/ఎన్టీఆర్, సాక్షి: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని ఇంకో కేసులో ఇప్పుడు మరో పీఎస్‌కు తరలిస్తున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆగమేఘాల మీద విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్(PT Warrant) కింది పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు.
సాయంత్రంలోగా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టులో లేదంటే మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే గనుక విజయవాడ జైలుకు పోసానిని తరలిస్తారు. లేదంటే మళ్లీ కర్నూలు జైలుకే తరలిస్తారు. ఈ కేసు చాలా ముఖ్యమైందని చెబుతూ కోర్టు నుంచి భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ పొందారు.
ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.

పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేసిన పిటిషన్లపై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
