పచ్చమూకల పాశవికం | Attack On YSRCP Leader Dasaradha Rami Reddy In Annamayya District, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం

May 3 2026 1:35 PM | Updated on May 4 2026 5:11 AM

Annamayya District: Attack On Ysrcp Leader Dasaradha Rami Reddy

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలో పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అనుచర మూకలు కత్తులు, రాడ్లతో రెచి్చపోయాయి. వైఎస్సార్‌సీపీ నేత, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ దశరథ రామిరెడ్డి పై హ­త్యాయత్నానికి తెగబడ్డాయి. కోర్టు స్టేటస్‌ కో విధించిన స్థలం వివాదం విషయంలో మంత్రి అనుచరులు జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో దశరథ రామిరెడ్డి తమ మాట వినడంలేదన్న అక్కసుతో సుమారు 100 మందికిపైగా యువకుల సాయంతో స్థలంలో నిర్మాణాలను చేపట్టారు. స్టేటస్‌ కో ఉన్నా దౌర్జన్యంగా మంత్రి అనుచరులు ఆదినారాయణరెడ్డి, అతని భార్య సుమన భూమిలో నిర్మాణాలను చేపట్టడానికి యత్నిస్తున్నారని అన్నమయ్య జిల్లా ఎస్పీ, స్థానిక డీఎస్పీ, సీఐలకు శనివారం దశరథరామిరెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యా­దుపై పోలీసుల వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని దశరథరామిరెడ్డి తెలిపారు. 

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డి ఆదివారం ఉదయం తన కళ్యాణమండపం ఎదురుగా ఉన్న నిర్మాణ ప్రాంతానికి వెళ్లి ప్రశ్నించడంతో అక్కడే ఉన్న పచ్చ మూకలు ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో  దశరథరామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతోపాటు కల్యాణ మండపం మేనేజర్‌ జాకీర్, అనుచరుడు దేరంగుల ఆంజనేయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మంది దశరథరామిరెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు పచ్చమూకల దాడిలో గాయపడ్డారు.  ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్న దశరథరామిరెడ్డి, ఆంజనేయులు, జాకీర్ను రక్షించేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా యత్నించారు. పచ్చమూకల బరితెగింపుతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.   

కళ్యాణ మండపంలో విధ్వంసం..  
వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడడంతోపాటు ఆయన కల్యాణ మండపంలోనూ పచ్చమూకలు విధ్వంసం సృష్టించాయి. మండపం తలుపులను ధ్వంసం చేసి అద్దాలను బద్దలు కొట్టారు. లోపల ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులను పగలగొట్టారు. సమీపంలోనే ఉన్న దశరథరామిరెడ్డి వాహనాన్ని కూడా పగలగొట్టారు.  

108 వాహనాన్నీ అడ్డుకున్నారు 
తీవ్రంగా గాయపడిన దశరథరామిరెడ్డితోపాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు వచి్చన 108 వాహనాన్నీ పచ్చమూకలు అడ్డుకున్నాయి. దీంతో దశరథరామిరెడ్డి భార్య విజయమ్మ కొంతమంది అనుచరులతో ఘటన స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న భర్తను, మరో ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై దశరథరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నుంచి ఎస్‌ఐ జహీర్‌బాషా వివరాలు సేకరించారు. కోర్టు స్టేటస్‌ కో ఇచ్చినా ఆదినారాయణ రెడ్డి, అతని భార్య దౌర్జన్యంగా కల్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో నిర్మాణాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించడానికి వెళ్లిన తనపై ఆదినారాయణ రెడ్డి మంత్రి అనుచరులతో దాడి చేయించారని పోలీసులకు రాయించిన వాంగ్మూలంలో తెలిపారు.  

భూమన పరామర్శ  
తిరుపతి తుడా: టీడీపీ గూండాల హత్యాయత్నంతో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డిని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి పరామర్శించారు. దాడి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, హత్యాయత్నాలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని భూమని పేర్కొన్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement