
ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన
మద్దిలపాలెం (విశాఖ)/తిరుపతి సిటీ: పురుగుల అన్నం ఎలా తినాలంటూ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు మండిపడ్డారు. మెస్ నాణ్యత, ఇతర సమస్యలపై మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం వర్సిటీ ముఖ ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. మూడు రోజుల కిందట చికెన్‌లో పురుగులు కనిపించాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్‌ల్లో నాణ్యత లేని, పురుగులు, కీటకాలతో కూడిన భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యుత్ బిల్లు, కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాలు మెస్ బిల్లుతో కలిపి విద్యార్థులపై భారం మోపుతున్నారని చెప్పారు.
బయటి వ్యక్తుల చొరబాటు, అసాంఘిక కార్యకలాపాలతో మహిళా వసతి గృహాల వద్ద భద్రత కరువైందని వాపోయారు. ప్రహరీల నిర్మాణం, సెక్యూరిటీ పెంపునకు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా తరగతులు ప్రారంభం కాలేదని, గెస్ట్ అధ్యాపకుల రెన్యూవల్ ప్రక్రియ జాప్యమే దీనికి కారణమని తెలిపారు. ఆర్వో ప్లాంట్లు, ఆధునిక కిచెన్, డైనింగ్ హాల్, కొత్త మంచాలు, కుర్చీలు, డిస్పెన్సరీలలో మందుల లభ్యత, గ్రంథాలయ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం వంటి అనేక సమస్యలను విద్యార్థులు ఏకరువు పెట్టారు.
‘ఇదేం రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. వీసీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరిస్తామని వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇది నమ్మశక్యంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు జోక్యం చేసుకుని, ఆగస్టు 21వ తేదీలోగా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఎస్వీయూ డీ మెస్ అన్నంలో వాన పాము!
ఎస్వీయూ డీ మెస్‌లో బుధవారం రాత్రి భోజనంలో వాన పాము కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 200 మందికిపైగా పీజీ విద్యార్థులు ప్రతి రోజు డీ మెస్‌లో ఆహారాన్ని స్వీకరిస్తారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా, విచారణ జరుపుతామంటూ దాటవేత ధోరణితో వ్యవహరిస్తుండటం పరిపాటిగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పరిస్థితి ఇలా తయారైందని చెబుతున్నారు. గతంలో పలుమార్లు ఆహారంలో జెర్రులు, పురుగులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. వందల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నాసిరకం భోజనాలను అందించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.