ఎగుమతులపై ‘ఈనాడు’కు ఎందుకీ ఏడుపు? | Sakshi
Sakshi News home page

ఎగుమతులపై ‘ఈనాడు’కు ఎందుకీ ఏడుపు?

Published Fri, Feb 18 2022 11:36 PM

Andhra Pradesh: Yellow Media Fake Allegations On Rice Exports - Sakshi

సాక్షి, అమరావతి: ఎగుమతులు పెరగడం అభివృద్ధికి సూచిక అని ఆర్థికవేత్తల నుంచి సామాన్యుల వరకూ అంగీకరిస్తారు. ఎగుమతులు పెరిగితే సహజంగా అంతా సంతోషిస్తారు. మన రాష్ట్రంలో మాత్రం ఎగుమతులు పెరుగుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు భజన పత్రిక ఈనాడుకు కంటగింపుగా మారింది. టీడీపీ పాలనలో 2018-19లో గరిష్టంగా 31.47 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయి.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకున్న సంస్కరణల ఫలితంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 52.88 లక్షల టన్నుల ఎగుమతులు (2020–21) నమోదయ్యాయి. 2021–22లో జనవరి నెలాఖరు నాటికి ఎగుమతులు 45 లక్షల టన్నులు దాటాయి. ఎగుమతుల్లో పెద్ద ఎత్తున వృద్ధి నమోదు కావడం, వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతుండటం టీడీపీ అనుకూల మీడియాకు కంటగింపుగా మారింది. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులపై వక్రభాష్యం చెబుతూ ఓ కట్టుకథను వండి వార్చింది. అంతా అక్రమం అంటూ గగ్గోలు పెడుతోంది. సగటు ధర లెక్కలతో పాఠకులను మభ్యపెట్టాలని చూస్తోంది. మసిపూసి మారేడు కాయ చేయాలని చూసినంత మాత్రాన నిజాలను దాచి పెట్టలేరు. అందుకే వాస్తవాలను పాఠకుల ముందు ఉంచుతున్నాం.

బాబు హయాంలోనూ కిలో రూ.21.71కే ఎగుమతి...
లెక్కలు, సగటులతో కనికట్టు చేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలన్నది ఈనాడు పన్నాగం. అందుకే గత మూడేళ్లలో సగటున కిలో రూ.25 చొప్పున బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారని గగ్గోలు పెట్టింది. మార్కెట్‌లో కిలో రూ.40 ఉన్న బియ్యాన్ని కేవలం రూ.25కే ఎగుమతి చేశారంటే రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి విదేశాలకు తరలించారని నిర్ధారించేసింది. సగటు లెక్కలతో కనికట్టు చేశానని సంబరపడింది. చంద్రబాబు హయాంలో ఎగుమతుల గురించి ఈనాడు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు.

చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా 2016–17లో ప్రైవేట్‌ వ్యాపారులు 2.04 కోట్ల క్వింటాళ్ల బియ్యాన్ని రూ.4431 కోట్లకు కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారు. అంటే సగటున రూ.21.71కే కిలో చొప్పున ఎగుమతి చేశారు. మరి చంద్రబాబు హయాంలో కూడా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసినట్లు భావించాలా...? ఈనాడు ఈ విషయాన్ని ఎందుకు విస్మరించింది? టీడీపీ హయాంలోనే  2017–18లో రూ.5,048 కోట్ల విలువైన 2.17 కోట్ల క్వింటాళ్ల బియ్యం ఎగుమతి చేశారు. అంటే సగటున కిలో రూ.23.15కే విక్రయించారు. 2018–19లో రూ.4,483 కోట్ల విలువైన 1.81 కోట్ల క్వింటాళ్ల బియ్యం ఎగుమతి జరిగింది. సగటున కిలో రూ.24.77 చొప్పునే ఎగుమతి చేశారు. కానీ ఇవేమీ ఈనాడుకు కానరాకపోవడం ఆ పత్రిక ద్వంద్వ నీతికి నిదర్శనం. 

ఆరేడు రాష్ట్రాల బియ్యం ఎగుమతి కేంద్రంగా కాకినాడ పోర్టు
దేశంలో బియ్యం ఎగుమతులకు తూర్పు తీరంలో ఉన్న కాకినాడ పోర్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క ఏపీ బియ్యమే కాకుండా తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ఘడ్, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన బియ్యాన్ని కూడా కాకినాడ పోర్టు నుంచే ఎగుమతి చేస్తున్నారు. అందుకే అంత భారీ పరిమాణంలో కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు ఉంటున్నాయి. ఆ వాస్తవం తెలిసినప్పటికీ ఈనాడు పాఠకులను మోసం చేసేందుకు ప్రయత్నించింది. కాకినాడ నుంచి ఎగుమతైన బియ్యం అంతా మన రాష్ట్రానిదే అనే దుష్ప్రచారానికి దిగింది. అసలు దేశంలో ఎంత బియ్యం పండుతోంది? స్థానికంగా వినియోగం ఎంత? ఇవన్నీ పోనూ ఇక ఎగుమతికి ఎంత అవకాశం ఉందనే కనీస అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా అసత్య కథనాన్ని ప్రచురించింది. కాకి లెక్కలతో రోతరాతలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విస్మయానికి గురిచేస్తోంది. 

బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రోత్సాహం
కేంద్రం ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దేశంలో ఏటా 125 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా 100 మిలియన్‌ టన్నులను స్థానికంగానే వినియోగిస్తున్నారు. సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ఏటా 25 మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతులకు కేంద్రం అనుమతులిస్తోంది. గతేడాది రూ.70 వేల కోట్ల విలువైన 21 మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. 2022–23లో 25 మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించారు. ఇది ప్రపంచ బియ్యం వాణిజ్యంలో 50 శాతం. దేశం నుంచి 50 బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి జరుగుతుండగా బాస్మతీయేతర ఎగుమతుల విలువ 10 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. దేశవ్యాప్తంగా 50 ఓడ రేవుల ద్వారా బియ్యం ఎగుమతి చేస్తున్నారు. తూర్పు తీరంలో లాజిస్టిక్స్‌ పరంగా కాకినాడ పోర్టు అనుకూలంగా ఉన్నందున ఎగుమతిదారుల్లో 80 శాతం మంది ఇక్కడి నుంచే వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నారు. 

ఎగుమతుల్లో రేషన్‌ బియ్యం లేదు
కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యే బియ్యంలో 80% కంటే ఎక్కువగా ఉడకబెట్టిన, విరిగిన బియ్యం ఉంటాయి. వీటి ధర సరాసరిన కిలో రూ.25 - రూ.27 మధ్య ఉంటుంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యే బియ్యం పూర్తిగా లాంగ్‌ గ్రెయిన్‌ రైస్‌.  ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డుదారులకు షార్ట్‌ గ్రెయిన్‌ రైస్‌ (చిన్న ధాన్యం బియ్యం) మాత్రమే పంపిణీ చేస్తారు. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యే బియ్యంలో షార్ట్‌ గ్రెయిన్‌ రైస్‌ ఉండదు. మరో కీలక విషయం ఏమిటంటే కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యే 90 శాతం లాంగ్‌ గ్రెయిన్‌ రైస్‌ ఏపీలో పండదు.

రాష్ట్రంలో  లాంగ్‌ గ్రెయిన్‌ రైస్‌  అందుబాటులో లేకపోవడంతో బియ్యం ఎగుమతిదారులు  దేశవ్యాప్తంగా ఈ రకం బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువగా తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ఘడ్, బిహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయగా వచ్చిన బియ్యాన్ని వాహనాలు, వ్యాగన్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తుంటారు. కాకినాడ నుంచి సగటున ఏటా 15 లక్షల టన్నుల కంటే ఎక్కువ బ్రోకెన్‌ రైస్‌ (నూకలు) ఎగుమతి జరుగుతోంది. దీని ధర కిలో రూ. 18 నుంచి రూ.20 ఉంటుంది. నూకల్లో ఎక్కువ భాగం చత్తీస్‌గఢ్‌ నుంచి సగటున కిలో రూ.25 చొప్పున కొనుగోలు చేస్తారు. 

ఏపీలో లాంగ్‌ గ్రెయిన్‌ రైస్‌ ఉత్పత్తి స్వల్పం
మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో 93.32 లక్షల ఎకరాలు, రబీలో 56.19 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. సాధారణంగా దిగుబడుల్లో 25–30 శాతాన్ని విత్తనాలు, తమ సొంత అవసరాల కోసం వినియోగించుకుంటారు. ప్రీమియం వెరైటీగా పేర్కొనే బీపీటీ–5204  ధాన్యం రాష్ట్రంలో 30 శాతానికి పైగా విస్తీర్ణంలో సాగవుతుంది. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో దీన్ని సాగు చేస్తారు.

ఈ వెరైటీ ధాన్యం కనీస మద్దతు ధర కంటే ఎక్కువ పలుకుతుంది. ఈ ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా రైసు మిల్లర్లే కొనుగోలు చేస్తుంటారు. ఇక పీఎల్‌ 1100 (బొండాలు) 10 శాతం విస్తీర్ణంలో సాగవుతుంది. బొండాలను ఎక్కువగా కేరళలో వినియోగిస్తుంటారు. అందువల్లే మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే బొండాలు రకం ధాన్యం కేరళకు ఎక్స్‌పోర్టు అవుతాయి. దేశంలో ఏపీ మినహా మరే రాష్ట్రంలోనూ ధాన్యానికి పక్కాగా కనీస మద్దతు ధర చెల్లించడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10,778 ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందచేస్తున్నారు. పైగా మన రాష్ట్రంలో రేషన్‌ బియ్యం పూర్తిగా పొట్టిరకం ధాన్యానికి చెందినదే. ఇది ఎగుమతులకు ఏమాత్రం పనికిరాదు.

రాష్ట్రంలో ధాన్యం దిగుబడులిలా..
రాష్ట్రంలో 2019–20 సీజన్‌లో 137.11 లక్షల టన్నుల పంట దిగుబడులొచ్చాయి. 6.62 లక్షల మంది రైతుల నుంచి రూ.15,037 కోట్ల విలువైన 82.57 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2020–21లో 130.89 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. 6.31 లక్షల మంది రైతుల నుంచి రూ.15,487 కోట్ల విలువైన 82.68 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 2021–22 ఖరీఫ్‌ సీజన్‌లో రెండో దిగుబడి అంచనా ప్రకారం 80.46 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని లెక్క గట్టారు. ఇప్పటి వరకు ఐదు లక్షల మంది రైతుల నుంచి రూ.6637 కోట్ల విలువైన 34.12 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సాధారణంగా క్వింటం ధాన్యాన్ని మర పట్టిస్తే 67 కిలోల బియ్యం వస్తుంది. ఆ లెక్కన లెవీకిచ్చిన బియ్యం 2019–20లో 55.32 లక్షల టన్నులు, 2020–21లో 55.39 లక్షల టన్నులుండగా 2021–22లో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు సేకరించిన ధాన్యాన్ని మర ఆడిస్తే 22.86 లక్షల టన్నుల బియ్యం వస్తుంది. 

దేశంలో తొలిసారిగా రైస్‌ ఏజింగ్‌ టెస్ట్‌..
ఇక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 2019–20లో 24.16 లక్షల టన్నులు, 2020–21లో 25.31 లక్షల టన్నులు, 2021–22లో 21.06 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేశారు. ఇక ఉచిత బియ్యం కింద 2020–21లో 15.28 లక్షల టన్నులు, 2021–22లో 17.16 లక్షల టన్నులు అదనంగా సరఫరా చేశారు. రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని దారి మళ్లించకుండా గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, డిప్యుటీ తహసీల్దార్లు, అసిస్టెంట్‌ సప్లయి ఆఫీసర్లు, డీఎస్‌లు, జేసీలు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆకస్మిక తనిఖీల ద్వారా రైసు మిల్లర్లు, ఎగుమతిదారులు, రవాణాదారులు, గోడౌన్లపై 2,043 ఆకస్మిక  దాడులు నిర్వహించి 1,07,221 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా బియ్యం తాజావా.. కాదా? అనే అంశాన్ని గుర్తించేందుకు రైస్‌ ఏజింగ్‌ టెస్టింగ్‌ సదుపాయాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మిల్లర్లు పీడీఎస్‌ బియ్యాన్ని సీఎంఆర్‌గా మళ్లించడం, రీ సైక్లింగ్‌ను గుర్తించడం, నిరోధించడం కోసం ఈ పరీక్ష చేస్తున్నారు.

Advertisement
Advertisement