వెదురు కొమ్ముల కూర.. ఎర్రచీమల గుడ్లతో చేసే చారు!

Andhra Pradesh: Recipes From Bamboo Tree Famous Buttayagudem - Sakshi

వెదురు వంట.. ప్రతి ఇంట

గిరిసీమల్లో వెదురు కొమ్ముల కూర ఘుమఘుమలు

గిరిజనుల సంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి 

బుట్టాయగూడెం/పశ్చిమ గోదావరి: భిన్నమైన సంసృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు గిరిపుత్రులు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఆ అడవి నుంచే అన్నీ పొందుతుంటారు. అలాగే వారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. అడవిలో దొరికే వాటితో వంటకాలు చేసుకుని ఆ రుచుల్ని ఆస్వాదిస్తుంటారు. తొలకరి అనంతరం కొండ కోనల్లో అడుగడుగునా కన్పించే వెదురు చెట్ల నుంచి మొలిచే కొమ్ముల్ని వండుకుని ఆనందిస్తుంటారు. అలాగే ఎర్రచీమల గుడ్లతో చేసే చారు ప్రత్యేకం.

సంప్రదాయ వంటకం కొమ్ముల కూర
ఎంతో రుచికరమైన వెదురు కొమ్ముల కూర అడవి పుత్రుల సంప్రదాయ వంట. మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగా వండుకుని తింటారు. అడవిలో వెదురు మొక్కల పక్కన మొలకెత్తే లేత పిలకల్ని కొమ్ములుగా పిలుస్తారు. వర్షాకాలంలో గిరిజన మహిళలు అడవికి వెళ్లి వాటిని సేకరిస్తారు. వెదురు కొమ్ముల తొక్కలు తీసి సన్నగా తరగాలి. అనంతరం నీళ్లలో తరుగును ఉడకపెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేయాలి. ఉప్పు వేసి కొంతసేపు ఉడికించాక.. ఎండు మిరపకాయలతో తాలింపు పెట్టి కూరను సిద్ధం చేస్తారు. వెదురు కొమ్ముల కూరలో ఇంకా రుచి రావాలంటే అందులో చింతచిగురు లేదా గోంగూర వేస్తుంటారు. ఈ కొమ్ముల కూరలో కారం వేస్తే కూర చేదు వస్తుంది. 

వర్షాకాలంలో ప్రత్యేకం 
వర్షాకాలంలో కొమ్ములు దొరికినంత కాలం గిరిజనులు ఈ కూరే తింటారు. ప్రతి ఇంట గ్రామాల్లో వెదురు కొమ్ముల కూర ఘుమఘుమలు అదిరిపోతుంటాయి. జూన్‌లో తొలకరి వర్షాలతో వెదురు చెట్లు చిగురిస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో వెదురు కొమ్ములు దొరుకుతాయి. ఆ సమయంలో ప్రతి ఇంటా కొమ్ముల కూర ఉండాల్సిందే. వెదురు కొమ్ముల సేకరణ అంత సులువేం కాదు. వాటి కోసం గిరిజన మహిళలకు అనేక ఇబ్బందులు తప్పవు. వెదురు కూపులో పిలకలు (కొమ్ములు) కోసే సమయంలో పొదల్లో విష సర్పాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వెదురు ముళ్లు విపరీతంగా గుచ్చుకుంటాయి. అయినా వాటి కోసం వెదుకులాట మానరు. 

1. వెదురులో రెండు రకాలు ఉన్నాయి. కొండ వెదురు, ములస వెదురు.
2. వీటిలో కొండ వెదురు కొమ్ములను గిరిజనులు ఎక్కువగా తింటారు. 

వెదురు కొమ్ముల కూర ఎంతో ఇష్టం కావడంతో కష్టమైనా జాగ్రత్తగా సేకరిస్తామని  గిరిజన మహిళలు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా.. అటవీప్రాంతానికి వెళ్ళి సేకరిస్తున్నారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి దొరికే వెదురు బియ్యంతోనూ ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. 

ఎర్ర చీమలతో చారు...
అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లకు చీమలు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. ఆ గూళ్ళను దులిపి దొరికే గుడ్లను నూరి ఆ చూర్ణంతో చారు కాసుకుంటారు. ఈ వర్షాకాలంలో ఈ చారు గిరిజనులు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. 

ఇది మా సంప్రదాయ వంటకం
అడవి వెదురు కొమ్ముల కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వంటకం. కొమ్ముల కూరలో ఎండు చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చెట్లకు పట్టే ఎర్ర చీమల పుట్టను తెచ్చుకుని దాని గుడ్లతో చారుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. 
– మాల్చి కోటంరెడ్డి, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం

వెదురు కూరలో ఎన్నో పోషకాలు
వానలు కురిసే సమయంలో ఎక్కువగా పప్పు కొమ్ముల కూరం తింటాం. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ కూర తినేవారు మంచి ఆరోగ్యం ఉంటారు. 
– మాల్చి పాపాయమ్మ, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top