
ఎంత కాలం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో బోధన సాగిస్తారు?
నియామకాల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా
సాక్షి, అమరావతి: సర్వశిక్షాభియాన్ పథకం కింద విద్యా సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించనప్పుడు వాటిల్లో చదివే అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని ఒక అప్పీల్ విచారణ సందర్భంగా హైకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. సర్వశిక్షాభియాన్ కింద ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకాలు మాత్రం చేపట్టడం లేదని న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆక్షేపించింది.
గెస్ట్, ఔట్‌సోర్స్, కాంట్రాక్ట్ బోధనా సిబ్బందితో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని నిలదీసింది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నా, పేద పిల్లలకు మాత్రం వాటి తాలుకు ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో అందడం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ తగిన విధంగా తేల్చాలని నిర్ణయించినట్లు తెలిపింది.
శాశ్వత బోధనా సిబ్బందిని నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. నాణ్యమైన విద్య అందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
నేపథ్యం ఇదీ...
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్థాంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అధికారుల తీరును తప్పుపట్టారు. పిటిషనర్లను తొలగించడం చట్టవిరుద్ధమని, ఏకపక్షమని తీర్పులో స్పష్టం చేశారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై సోమవారం జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.