Andhra Pradesh: లంచమడిగితే ‘యాప్‌’తో కొట్టండి

Andhra Pradesh Govt Mobile APP For Anti-corruption - Sakshi

14400 యాప్‌తో అవినీతికి చెక్‌

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలమేరకు యాప్‌కు ఏసీబీ రూపకల్పన

ఎవరు లంచం అడిగినా వెంటనే ఫిర్యాదు చేయొచ్చు

ప్రత్యక్ష ఆధారాలతో సహా లంచగొండులను పట్టించొచ్చు

ఆడియో, వీడియో లైవ్‌ రికార్డింగ్‌తో సహా ఫిర్యాదు

యాప్‌లో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్‌

దానిద్వారా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు

ఫిర్యాదులపై పురోగతి వివరాలు కూడా అందుబాటులో

యాప్‌ను త్వరలో ఆవిష్కరించనున్న సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: అవినీతి నిరోధానికి ప్రభుత్వం ప్రజల చేతికే వజ్రాయుధాన్ని అందిస్తోంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. లంచాలు, అవినీతి లేకుండా ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పారు.

అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించాలని పోలీసు శాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ‘14400 యాప్‌’ ను రూపొందించింది. లంచగొండుల పాలిట సింహస్వప్నంలా దీనిని రూపొందించారు. ఈ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ త్వరలోనే ఆవిష్కరించనున్నారు. 

తక్షణం ఫిర్యాదుకు అవకాశం 
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం వినూత్న రీతిలో ‘దిశ’ యాప్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే ఆదుకొనేందుకు , పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మహిళలు ఫిర్యాదు చేసేందుకు, రూపొందించిన ఈ యాప్‌ విజయవంతమైంది. అదే తరహాలో అవినీతిపై ప్రజలు తక్షణం ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీనికి రూపకల్పన చేసింది. 

ఆడియో, వీడియో, ఫొటో ఆధారాలతో సహా ఫిర్యాదు 
అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ కొంతకాలంగా 14400 టోల్‌ఫ్రీ నంబరును నిర్వహిస్తోంది. ఈ నంబరుతో ఫిర్యాదు మాత్రమే చేయగలరు. ఫిర్యాదుదారులు సాక్ష్యాధారాలు సమర్పించేందుకు అవకాశాలు తక్కువ. క్షేత్రస్థాయిలో అవినీతిపై ప్రత్యక్షంగా ఆధార సహితంగా ఫిర్యాదు చేయడం సాధ్యం కాదు. టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్‌ కాల్స్‌పై ఏసీబీ అధికారులు స్పందించి తరువాత ఆకస్మిక దాడులు, తనిఖీలు చేస్తారు.

బాధితుల  ద్వారా లంచం ఎరవేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొంటారు. ఇవన్నీ కాలయాపనతో కూడుకున్నవి. అవినీతి అధికారులు, సిబ్బంది జాగ్రత్తపడే అవకాశం ఉండేది. కొందరు అధికారులు నేరుగా లంచాలు తీసుకోకుండా వారి ఏజెంట్లకు ఇవ్వమని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు ముగింపు పలుకుతూ అవినీతిని తక్షణం ఆధార సహితంగా ఫిర్యా దు చేసేందుకు అవకాశం కల్పించేందుకే 14400 యాప్‌ను ఏసీబీ రూపొందించింది.

విస్తృత అవగాహన 
దిశ యాప్‌ తరహాలోనే ఏసీబీ 14400 యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. అందుకోసం జిల్లా, మున్సిపాలిటీ, మండల, పంచాయతీ స్థాయిలో అవగాహన సదస్సులు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అవగాహన కల్పిస్తారు. కరపత్రాలు, టీవీ, పేపర్లలో ప్రకటనల ద్వారా యాప్‌ ఉపయోగాలను ప్రజలకు తెలియజేస్తారు. 

అవినీతి అంతం దిశగా  కీలక ముందడుగు 
‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 14400 యాప్‌ను రూపొందించాం. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి లేకుండా చేయాలన్న లక్ష్య సాధన కోసమే ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నాం. ప్రజలు సులభంగా, ఆధార సహితంగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ అవకాశం కల్పిస్తుంది. ఏసీబీ అధికారులు కూడా తక్షణం చర్యలు తీసుకునేందుకు సాధ్యపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే ఈ యాప్‌ను ఆవిష్కరిస్తారు.’  
    – డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి    

యాప్‌ పని చేస్తుందిలా.. 
► 14400 మొబైల్‌ యాప్‌లో ‘లైవ్‌ రిపోర్ట్‌’ ఉంటుంది. 
► అధికారులు, సిబ్బంది లంచాలు అడుగుతున్నా, ఇతరత్రా అవినీతికి పాల్పడుతున్నా ఆ యాప్‌లో లైవ్‌ రిపోర్టింగ్‌ ఫీచర్‌ ద్వారా తక్షణం ఫిర్యాదు చేయవచ్చు. 
► లైవ్‌ రిపోర్టింగ్‌ ఫీచర్‌లో ఫొటో,వీడియో, ఆడియో, ఫిర్యాదు నమోదు ఆప్షన్లు ఉన్నాయి. 
► లంచం తీసుకుంటున్న లైవ్‌ ఫొటో తీసి ఆ యాప్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు 

► లంచం అడుగుతున్నప్పుడు మాటలను లైవ్‌లో రికార్డ్‌ చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. 
► లైవ్‌ వీడియో కూడా రికార్డు చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. 
► లైవ్‌ రిపోర్ట్‌కు అవకాశం లేకపోతే.. బాధితులు అప్పటికే రాసి ఉంచిన ఫిర్యాదు కాపీగానీ సంబంధిత ఫొటోలు, ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయవచ్చు. 
► అనంతరం లాడ్జ్‌ కంప్లైంట్‌ ( ఫిర్యాదు నమోదు) ఆప్షన్‌లోకి వెళ్లి సబ్‌మిట్‌ ప్రెస్‌ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేరుతుంది. ఫిర్యాదు చేసినట్టు వెంటనే మెసేజ్‌ వస్తుంది. 

► వెంటనే ఆ ఫిర్యాదు ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌కు వెళుతుంది. అక్కడి సిబ్బంది  ఫిర్యాదును సంబంధిత జిల్లా ఏసీబీ విభాగానికి పంపుతారు. 
► వెంటనే సంబంధిత అధికారులు ఆ ప్రభుత్వ అధికారి, సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టుగానీ ఇతరత్రా కఠిన చర్యలుగానీ తీసుకుంటారు. 
► కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ  కేసు పురోగతిని ఏసీబీ ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపరుస్తుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top