గోదారమ్మ మణిహారంలో కలికితురాయి

Andhra Pradesh Govt Focus On Polavaram Project - Sakshi

పోలవరం జలవిద్యుత్కేంద్రం నుంచి సాక్షి ‘ప్రత్యేక’ ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు: గోదారమ్మ మణిహారంలో మరో కలికితురాయి ఒదగనుంది. పోలవరం జాతీయ బహుళార్ధక సాధక ప్రాజెక్టులో అంతర్భాగంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలవిద్యుత్కేంద్రాలలో ఇదే అతి పెద్దది కావడం గమనార్హం. జలాశయం పనులు పూర్తయ్యేలోగా జలవిద్యుత్కేంద్రం పను­లనూ పూర్తి చేయాలని నిర్ణయించింది.

పోలవరం జలవిద్యుత్కేంద్రం పూర్తయితే రాష్ట్ర విద్యుత్‌ ముఖచిత్రంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని విద్యుత్‌ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. పోలవరం ఎర్త్‌ కమ్‌ రాక్‌  ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ గ్యాప్‌–1కి ఎడమవైపున కొండను తొలచి 960 మెగావాట్లు (1280) సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించే డిజైన్‌ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది. 

రివర్స్‌ టెండరింగ్‌తో రూ.405.23 కోట్లు ఆదా
పోలవరం నీటిపారుదల ప్రాజెక్టులో మిగిలిన రూ.3,302 కోట్ల విలువైన పనులను 2018 ఫిబ్రవరి 27న నామినేషన్‌ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టిన టీడీపీ సర్కార్‌ రూ.3,216.11 కోట్ల వ్యయంతో జలవిద్యుత్కేంద్రం పనులను కూడా అదే సంస్థకు కట్టబెట్టింది. ఆ సంస్థ నుంచి నాటి సీఎం చంద్రబాబు భారీగా ముడుపులు 
వసూలు చేసుకున్నారు. ఈ అక్రమాలపై నిపుణుల కమిటీతో విచారణకు ఆదేశించిన సీఎం వైఎస్‌ జగన్‌..  కమిటీ సిఫార్సుల మేరకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. జలవిద్యుత్కేంద్రం పనులను రూ.2,810.88 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.405.23 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు అక్రమాల బాగోతాన్ని రివర్స్‌ టెండరింగ్‌ బట్టబయలు చేసింది. 

శరవేగంగా పనులు..
టీడీపీ హయాంలో జలవిద్యుత్కేంద్రం పనుల్లో ఎలాంటి ప్రగతి లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం జలవిద్యుత్కేంద్రం నిర్మాణానికి వీలుగా గోదావరి ఎడమ గట్టుపై ఉన్న కొండను తొలిచే పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు.
– జలవిద్యుత్కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్‌ టన్నెళ్లు(సొరంగాలు) తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. 150.3 మీటర్ల పొడవు, 9 వ్యాసంతో కూడిన 12 టన్నెళ్లను తవ్వారు. 
– ప్రెజర్‌ టన్నెళ్లలో ఫెరోల్స్‌ అమర్చి లైనింగ్‌ పనులను చేపట్టారు. ఇప్పటికే ఏడు టన్నెళ్లలో ఫెరోల్స్‌ అమర్చి లైనింగ్‌ పనులను దాదాపుగా పూర్తి చేశారు. సొరంగాల ద్వారా నీరు సక్రమంగా వెళ్లేందుకు లైనింగ్‌ తోడ్పడుతుంది. 
– ఒక్కో టన్నెల్‌లో 52 ఫెరోల్స్‌ చొప్పున 12 టన్నెళ్లలో 624 ఫెరోల్స్‌ను అమర్చనున్నారు. 9 మీటర్ల వ్యాసం, 25 మిల్లీమీటర్ల మందంతో కూడిన ఇనుప రేకులతో వీటిని తయారు చేశారు. ఫెరోల్స్‌ తయారీకి మొత్తం 8520 టన్నుల స్టీల్‌ను వినియోగించారు. 
– ఈ టన్నెళ్లకు చివర తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లను ఏర్పాటు చేస్తారు. టర్బైన్ల పునాది పనులను వేగవంతం చేశారు. 
– వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్ల తయారీని భోపాల్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈల్‌కు అప్పగించారు. ఈ టర్బైన్లు ఆసియాలోనే అతి పెద్దవి కావడం గమనార్హం.

హిమాలయ జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా..
– గోదావరి నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహమంతా పోలవరం ప్రాజెక్టు మీదుగానే ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతోంది.
– జలవిద్యుత్కేంద్రంలో ఒక సొరంగం (యూనిట్‌) ద్వారా 80 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే రోజుకు 331 క్యూమెక్కులు (11,690 క్యూసెక్కులు) నీటిని విడుదల చేయాలి. ఈ లెక్కన 12 సొరంగాలలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలంటే 1,40,280 క్యూసెక్కులు (12 టీఎంసీలు) అవసరం. 
– పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు వద్దకు జూలై నుంచి అక్టోబర్‌ రెండో వారం వరకూ ఏడాదికి సగటున 100 నుంచి 120 రోజుల వరకూ 1.50 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద ప్రవాహం వస్తుంది. అంటే ఏడాదికి సుమారు వంద నుంచి 120 రోజులు పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు.
– ఆ తర్వాత వరద ప్రవాహం తగ్గిన మేరకు విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. గోదావరి డెల్టాకు రబీ పంటలకు పోలవరం నుంచే నీటిని విడుదల చేయాలి. వాటిని విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తారు. అంటే ఏడాది పొడవునా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. 
– అందువల్ల హిమాలయ నదులపై ఏర్పాటు చేసిన జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో కరెంట్‌ ఉత్పత్తి అవుతుందిన అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top