వేగవంతంగా గృహ గణన | - | Sakshi
Sakshi News home page

వేగవంతంగా గృహ గణన

May 20 2026 2:16 AM | Updated on May 20 2026 2:16 AM

అనంతపురం అర్బన్‌: జనగణనలో భాగంగా తొలి దశలో చేపట్టిన గృహగణన ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా సాగుతోంది. ఎన్యుమరేటర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గృహగణన చేపట్టారు. అధికారిక నివేదిక ప్రకారం జిల్లాలో 7,07,999 గృహాలు, జనాభా 23,79,641 ఉన్నట్లు జిల్లా యంత్రాంగం అంచనా. ఎన్యుమరేటర్లు ఇప్పటి వరకు 6,40,096 ఇళ్ల గణనను (90.41శాతం) పూర్తిచేశారు. అదే క్రమంలో 19,09,297 జనాభా గణన (80.23శాతం) పూర్తి చేశారు. ఎన్యుమరేటర్లు చేపట్టిన గృహగణన ఈ నెల 30తో ముగియనుంది. పది రోజుల వ్యవధిలో 67,903 గృహాలు, 4,70,344 జనాభా గణన పూర్తి చేయాల్సి ఉంది. గృహగణన ప్రక్రియను కలెక్టర్‌ ఆనంద్‌, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్‌ఓ మలోల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

బాల పురస్కార్‌ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం సెంట్రల్‌: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ శశికళ కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఈ అవార్డుకు అర్హులని తెలిపారు. ప్రతి ఏటా ఢిల్లీలో జనవరి 26న గణతంత్ర వేడుకల రోజున ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందజేయనున్నట్లు వివరించారు. అర్హత కలిగిన వారు జూలై 31లోగా https://awrds.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

మొలల క్లినిక్‌ సీజ్‌

ఉరవకొండ: పట్టణంలోని సుభాని మొలల క్లినిక్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ (డీఎంహెచ్‌ఓ) శ్రీనివాసరెడ్డి మంగళవారం సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల క్లినిక్‌లో వైద్యం పొందిన మహిళా రోగి మృత్యువాత పడినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో క్లినిక్‌ను తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రథమ చికిత్స కేంద్రంలో రోగులకు సైలెన్లు ఎక్కించడం, యాంటీబయాటిక్స్‌ వాడించడం, శస్త్రచికిత్సలు చేయడం నేరమన్నారు. అర్హతలు లేకుండా ఆల్లోపతి వైద్యం అందిస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం క్లినిక్‌ను సీజ్‌ చేసి, నిర్వాహకులు సుభానికి నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి లక్ష్మీనారాయణ, ఉరవకొండ వైధ్యాధికారి డాక్టర్‌ వినీత తదితరులు పాల్గొన్నారు.

బంగారం కొనొద్దంటే మేమేం కావాలి?

రాయదుర్గం టౌన్‌: ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు ఆపేయండని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై స్వర్ణకారులు భగ్గుమన్నారు. బంగారు కొనొద్దని పిలుపునిస్తే మేము ఎలా బతకాలి అంటూ ప్రశ్నించారు. స్వర్ణకారుల రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు మంగళవారం రాయదుర్గంలో జ్యువెల్లరీషాపులు బంద్‌ చేసి, వినాయక సర్కిల్‌లో నిరసన తెలియజేశారు. అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వీరి ఆందోళనకు సీపీఎం డివిజన్‌ ఇన్‌చార్జ్‌ నాగార్జున మద్దతు తెలిపి పాల్గొన్నారు. స్వర్ణకారుల సంఘం, జ్యువెల్లరీ షాపుల యూనియన్‌ ప్రతినిధులు కంసల నాగరాజు, ఎస్‌ఎంజీ ఘని, హారూన్‌బాషా తదితరులు మాట్లాడారు. భారీగా పెరిగిన బంగారం ధరలతో వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఏడాది పాటు బంగారు కొనుగోలు చేయరాదని ప్రధాని పిలుపుతో ప్రజల్లో అనిశ్చితి నెలకొని ఆర్డర్లు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ హరి కుమార్‌కు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement