● నేడు మందుల షాపుల బంద్
● ఉమ్మడి జిల్లాలో 2,100 షాపుల మూత
తాడిపత్రి రూరల్/ అనంతపురం: ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలని అఖిల భారత కెమిస్టుల సమాఖ్య బుధవారం మెడికల షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అనంతపురం జిల్లాలో 1500, శ్రీసత్యసాయి జిల్లాలో 600 మందుల షాపులు మూతపడనున్నాయి. ఆన్‌లైన్ విక్రయాలకు 2018 అగస్టు 28న కేంద్ర ప్రభుత్వం ఈ – ఔషధి పేరిట జారీ చేసిన జీఓ 817ఎఫ్, 2020 మార్చిలో కరోనా సమయంలో జారీ చేసిన 220 తాత్కాలిక జీఓరద్దు చేయకుండా కొనసాగించడంపై మెడికల్ షాపుల నిర్వాహకులు ఆగ్రహంతో ఉన్నారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్లు లేకుండా అన్‌లైన్‌లో మందుల విక్రయాల వల్ల రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదకర మందులను విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయని మెడికల్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.
నిలిచిపోనున్న రూ.5కోట్ల అమ్మకాలు
దేశవ్యాప్త బంద్‌లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం 2,100 మందుల దుకాణాలు మూత పడనున్నాయి. దీంతో దాదాపు రూ.5కోట్ల మేర రోజువారీ అమ్మకాలు నిలిచిపోనున్నాయి. మెడికల్‌షాపుల బంద్ వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ప్రధాన కేంద్రాల్లో ఒకటి, రెండు మెడికల్ షాపులను తెరిచే ఏర్పాట్లను చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ విక్రయాలు అరికట్టాలి
ఆన్‌లైన్ మందుల విక్రయాలను వెంటనే నియంత్రించాలి. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్ ముసుగులో చేస్తున్న అక్రమాలను అరికట్టాలి. నకిలీ మందుల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలను రద్దు చేయాలి.
– రంగారెడ్డి, కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం
నేడు అనంతపురంలో ర్యాలీ
కార్పొరేట్ సంస్థలు ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు ఇవ్వడంతో సాధారణ మందుల షాపుల నిర్వాహకులకు నష్టాలు వస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మకాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మెడికల్ షాపుల బంద్‌లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం.
– కదిరప్ప, జిల్లా కార్యదర్శి,
ఏపీ మెడికల్, సేల్స్ రెప్రజెంటేటివ్స్ యూనియన్


