స్టేటస్‌కో ఉన్నా.. దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

స్టేటస్‌కో ఉన్నా.. దౌర్జన్యం

May 20 2026 2:16 AM | Updated on May 20 2026 2:16 AM

బోర్డులు తొలగించి కంచె వేశారు

పాపంపేట భూ వ్యవహారంలో బాధితుల ఆవేదన

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ పాపంపేట 106–1 సర్వే నంబరులో భూ వివాదంపై హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసిందని, అయినా కొందరు భూమిలోకి ప్రవేశించి అక్కడ ఏర్పాటు చేసిన నోటీస్‌ బోర్డులను బలవంతంగా తొలగించి కంచె వేయడానికి యత్నించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. పట్నం రామకృష్ణారావు మాట్లాడుతూ 1949లో పాపంపేట పరిధిలోని 106–1, 106–2, 119–1, 119–2ఏ సర్వే నంబర్లలో 10 ఎకరాల భూమిని గొల్లపల్లి, రాచూరి కుటుంబ సభ్యులు ఉమ్మడిగా తమకు దాన విక్రయం కింద రిజిస్ట్రేషన్‌ చేయించారని తెలిపారు. 1952లో తమ భూమిని పక్కనపెట్టి మిగతా భూములకు ఆ రెండు కుటుంబాల వారు భాగపరిష్కారాలు చేసుకున్నారని చెప్పారు. 1962లో గొల్లపల్లి కుటుంబ సభ్యులు మరోసారి భాగపరిష్కారాలు చేసుకున్నారని గుర్తు చేశారు. అయితే వారికి ఏమాత్రం సంబంధం లేని 4.20 ఎకరాల భూమిని 1976లో ఎంజీ బ్రదర్స్‌కు విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. తమకు దాన విక్రయం కింద ఇచ్చిన మొత్తం 10 ఎకరాల భూమిపై తమకు అనుకూలంగా 2025 మే 7న హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఏర్పాటు చేసిన నోటీస్‌ బోర్డులను అక్రమంగా తొలగించి, సంబంధం లేని జడ్జిమెంట్‌ను చూపిస్తూ కొత్త బోర్డులు ఏర్పాటు చేశారని రామకృష్ణారావు ఆరోపించారు. రిటైర్డ్‌ వీఆర్‌ఓ సుబ్రహ్మణ్యం తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల్లోని రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. పట్నం శివప్రసాద్‌ మాట్లాడుతూ 1949లో దానం చేసిన భూమినే ప్రస్తుతం ఆక్రమిత భూమిగా చూపుతున్నారని మండిపడ్డారు. తహసీల్దార్‌ మోహన్‌కుమార్‌, ఆర్డీఓ కేశవనాయుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏడాది కిందట తమ ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ, ఇప్పటికీ తరచూ వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. శ్రావణ్‌కుమార్‌, రిటైర్డ్‌ వీఆర్‌ఓ సుబ్రహ్మణ్యం, శివ అనే ముగ్గురూ కలిసి భూమిలో ఉన్న బోర్డులను తొలగించి కంచె వేయాలని ప్రయత్నించారని తెలిపారు. తాను ప్రముఖ నాట్యాచార్యుడినని, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement