యాడికి: ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం ఇస్తేనే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు భూములిస్తామని రైతులు స్పష్టం చేశారు. లేదంటే ప్రాజెక్టుకు భూములిచ్చే ప్రసక్తే లేదని జేసీ విష్ణుచరణ్‌కు తేల్చి చెప్పారు. కుందనకోట – చింతలాయపల్లి మధ్యన ఏర్పాటు చేయనున్న 950 మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 223 మంది కుందనకోట రైతుల నుంచి 321.93 ఎకరాలు, కమలపాడు రెవెన్యూ గ్రామంలోని 36 మంది రైతులకు చెందిన 76.538 ఎకరాల పట్టా భూమి సేకరించనున్నారు. భూ సేకరణ ధర నిర్ణయంపై మంగళవారం కమలపాడు పంచాయతీలోని చింతల వెంకటరమణస్వామి దేవస్థానం వద్ద సదరు రైతులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం సేకరించే భూమి ఇక్కడ ఎకరా రూ.8లక్షలు ఉందని, మీరు ఎంతకు ఇస్తారని అడిగారు. ఇందుకు రైతులు మాట్లాడుతూ ఈ ధర చాలా తక్కువని, తమకు సమ్మతం కాదని తెలిపారు. తాము ఇకపై ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదు కనుక ఎకరా రూ.30లక్షల ప్రకారం అయితే అమ్మేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. జేసీ ఆఖరుకు రూ.13 లక్షల వరకు ఇవ్వగలమని తెలపగా.. ఆ ధరకు అయితే భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, ఏపీ జెన్‌కో అధికారులు ఆదినారాయణరెడ్డి, ఆంజనేయులు, యాడికి సీఐ శ్రీనివాసులు ఎస్‌ఐ గోపాల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


