జిల్లాలో సంచలనం రేకెత్తించిన ఇంటర్ జవాబుపత్రం మాయం వ్యవహారం రోజులు గడుస్తున్నా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అంశం చర్చనీయాంశంగా మారినా... నేటికీ సంబంధిత అధికారులు కనీస విచారణ కూడా చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్పాట్ కేంద్రం నుంచి ఇంటర్ మూల్యాంకనం సమయంలో సివిక్స్ సబ్జెక్టుకు చెందిన జవాబుపత్రం కనిపించకుండా పోయింది. నిబంధనల ప్రకారం ఇలాంటి ఘటన చోటు చేసుకున్న వెంటనే విషయాన్ని డీవీఈఓ, ఆర్జేడీ, అనంతరం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ) దృష్టికి క్యాంపు అధికారి తీసుకెళ్లాలి. అలాగే జవాబుపత్రం దొరికే వరకు ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బందిని రిలీవ్ చేయకూడదు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అయితే ఈ అంశాలను అధికారులు తొక్కిపట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఐదు రోజుల పాటు ఆచూకీ లేకుండా పోయిన జవాబు పత్రం ఆరో రోజు మూల్యాంకన కేంద్రానికి సంబంధం లేని సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఫిజిక్స్ ల్యాబ్‌లో బయటపడింది. సాధారణంగా ఎప్పుడూ తాళం వేసి ఉండే ఫిజిక్స్ ల్యాబ్‌లోకి ఆ జవాబుపత్రం ఎలా చేరింది? ఎవరు అక్కడ ఉంచారు? ఎందుకు ఉంచారు? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానం లేదు.
ఎవరినైనా లక్ష్యం చేసుకున్నారా?
ఇంత పెద్ద ఘటన జరిగినా నేటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారాన్ని నడిపించారా? లేక లోపాలను కప్పిపుచ్చేందుకే మౌనం పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశాన్ని కొందరు నేరుగా బోర్డు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా... ఇప్పటి వరకూ ఎలాంటి విచారణ కమిటీని నియమించకపోవడం గమనార్హం. ఈ పరిస్థితులకు ఓ అధికారి వ్యవహార శైలే కారణమంటూ అధ్యాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధుల్లో పాల్గొనాలంటేనే భయపడుతున్నారు.
డీవీఈఓను పక్కకు పెట్టడంపై
అనుమానాలు
జిల్లాలో రెగ్యులర్ డీవీఈఓగా గురుస్వామిశెట్టి ఉన్నా... పరీక్షల నిర్వహణలో ఆయనను పూర్తిగా పక్కన పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. నేరుగా బోర్డు అధికారులే వ్యవహారం నడిపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జవాబుపత్రం మాయం వ్యవహారంపై ప్రభుత్వం, ఇంటర్ బోర్డు తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధ్యాపక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇంటర్ జవాబుపత్రం మాయం వ్యవహారంలో అంతు చిక్కని రహస్యం
మూల్యాంకన కేంద్రం నుంచి మాయమైన జవాబుపత్రం వారం తర్వాత ఫిజిక్స్ ల్యాబ్‌లో ప్రత్యక్షం
అంశంపై పోలీసులకు నేటికీ అందని ఫిర్యాదు
బాధ్యులపై చర్యలు లేకపోవడంపై తీవ్ర విమర్శలు


