ఈడిగ (గౌడ) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఈడిగ (గౌడ) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

May 20 2026 2:16 AM | Updated on May 20 2026 2:16 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ చాటిన ఈడిగ (గౌడ) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నారు. ఈ మేరకు ఈడిగ (గౌడ) ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈ.విశ్వనాథ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.మనోహర్‌, ట్రెజరర్‌ ఎన్‌.విజయ్‌కుమార్‌ మంగళవారం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి 450 మార్కులు, ప్రైవేట్‌ పాఠశాలల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అలాగే ఇంటర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివి 800 మార్కులు, ప్రైవేట్‌ కళాశాలల్లో చదివి 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. అర్హులైన విద్యార్థుల వివరాలను ఈ నెల 26వ తేదీ లోపు 99632 53404, 99856 04329, 87907 90435 నంబర్లకు వాట్సాప్‌ ద్వారా అందజేయాలని కోరారు. జూన్‌ 7న అనంతపురం రూరల్‌ మండలం రాయల్‌నగర్‌లోని రేణుకాయల్లమ్మ కల్యాణమంటపంలో ప్రతిభా పురస్కారాలను అందజేస్తామన్నారు.

శతాధిక వృద్ధురాలి మృతి

బెళుగుప్ప: స్థానిక వినాయక నగర్‌లో నివాసముంటున్న పద్మా గౌరమ్మ(101) సోమవారం రాత్రి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కాగా, అల్లుళ్లు, కోడళ్లు, మనుమలు, ముని మనవలు, మనువరాళ్లతో కలిసి మొత్తం వంద మంది వరకు ఉన్నారు. వృత్తి రీత్యా భర్త పెద్దన్న ఉపాధ్యాయుడు కావడంతో చదువుకు ప్రాధాన్యతనిస్తూ పిల్లలను బాగా చదివించి, ఉన్నతస్థాయిలో స్థిరపడేలా చేశారు. భర్త మరణానంతరం ఆమె అనంతపురంలోని కుమారుడి ఇంట్లో ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో వృద్ధాప్యం కారణంగా సోమవారం రాత్రి ఆమె మృతి చెందారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.

బంజారా జోడో ఏక్తా భారత్‌ యాత్ర విజవంతం చేయండి

మాజీ మంత్రి డి.రవీంద్రనాయక్‌ పిలుపు

గుత్తి రూరల్‌: మండలంలోని సేవాఘడ్‌ నుంచి జూన్‌లో ప్రారంభం కానున్న బంజారా జోడో ఏక్తా భారత్‌ యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బంజారా భారత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ధరావత్‌ రవీంద్రనాయక్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు సేవాఘడ్‌ ట్రస్టు అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు, జాతీయ బంజారా నాయకులు రవినాయక్‌రాథోడ్‌, కమల్‌రాథోడ్‌తో కలిసి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బంజారాల ఘన చరిత్రను దేశానికి చాటిచెప్పేలా యాత్ర కొనసాగుతుందన్నారు. గత 78 సంవత్సరాలుగా బంజారాల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయని పేర్కొన్నారు.

వడదెబ్బతో యువకుడి మృతి

తాడిపత్రి రూరల్‌: స్థానిక బుడేన్‌ కాంప్లెక్స్‌ వద్ద గుర్తుతెలియని యువకుడి (30) మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ ఆరోహణరావు అక్కడకు చేరుకుని పరిశీలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించి, గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

గుంతకల్లుటౌన్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో విశాఖలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో గుంతకల్లు ఎస్‌జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని మేఘనరాజ్‌ ప్రతిభ కనబరిచి మొదటిస్థానాన్ని కై వసం చేసుకుంది. బాలికల (50 కేజీల) విభాగంలో మేఘన రాజ్‌ అద్భుతంగా రాణించి విజయం సాధించినట్లు హెచ్‌ఎం గోపాల్‌రెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్లు వేణుగోపాల్‌, జ్యోతి, ఎం.కె.రాజేష్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. తమ పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో మొదటిస్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement