వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య

May 20 2026 2:16 AM | Updated on May 20 2026 2:16 AM

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కారణాలు ఏమో తెలియదు కానీ రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా, అప్పులు తీర్చే మార్గం కానరాక ఒకరు, తాగుడు అలవాటు మానుకోలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

గుత్తి: స్థానిక జీఆర్‌పీ పరిధిలోని జక్కలచెరువు– రాయలచెరువు రైల్వేస్టేషన్ల మధ్య మార్గంలో గూడ్స్‌ రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికుల సమాచారంతో జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

తాగుడు అలవాటు మానుకోలేక..

కళ్యాణదుర్గం రూరల్‌: స్థానిక రాచప్పబావి వీధిలో నివాసముంటున్న మహమ్మద్‌ రఫీ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంచాల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల మద్యానికి బానిసైన మహమ్మద్‌రఫీ సంపాదన మొత్తంగా తాగుడుకే ఖర్చు పెడుతుండడంతో పోషణ భారమైంది. తాగుడు మానేయాలని పలుమార్లు భార్య ప్రాధేయపడిన వినలేదు. ఈ నేపథ్యంలోనే తాగుడు అలవాటు మానుకోలేక మంగళవారం విద్యానగర్‌లోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

చిరు ప్రాయంలోనే మద్యానికి బానిసై..

శెట్టూరు: మండలంలోని కరిడిపల్లి గ్రామానికి చెందిన బోయ బాలాజీ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య సంధ్యాశ్రీ ఉన్నారు. చిరుప్రాయంలోనే మద్యానికి బానిసైన బాలాజీ జులాయిగా మారాడు. తాగుడు మానేసి ఏదైనా పనీపాట చేసుకుంటూ మంచిగా బతకాలని కుటుంబసభ్యులు హితవు పలికడంతో క్షణికావేశానికి లోనై సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బాలాజీ మృతి చెందాడు. ఘటనపై శెట్టూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అప్పుల తీర్చే మార్గం కానరాక...

బ్రహ్మసముద్రం : మండలంలోని వేపులపర్తి గ్రామానికి చెందిన ఎ.శివన్న(45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్సకు, ఇంటి అవసరాలకు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. అప్పులకు వడ్డీల భారం పెరుగుతుండడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మదనపడేవాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం పోలేపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అప్పుల విషయంగా చర్చించాడు. అనారోగ్యం కారణంగా అప్పులు తీర్చులేక పోతున్నానని మదన పడ్డాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో గ్రామ శివారున పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికుల సమాచారంతో బంధువులు అక్కడు చేరుకుని అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న శివన్నను వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement