పద్మావతీ..ఏమిటీ దుర్గతి?!
● సర్వజనాస్పత్రిలో పరిశుభ్రతను గాలికొదిలేసిన ఏజెన్సీ
● బాబుగారి తాలూకా అని నోరుమెదపని అధికారులు
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సురక్షిత ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన ఏజెన్సీ నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా చికిత్సల కోసం వచ్చే రోగులు అపరిశుభ్రత కారణంగా ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్న పరిస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన బోధనాస్పత్రుల్లో అనంతపురం సర్వజనాస్పత్రి ఒకటి. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్ పద్మావతి ఏజెన్సీ చేజిక్కించుకుంది. ఈ ఏజెన్సీ నిర్వాహకుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మిత్రుడని తెలిసింది. అక్యూట్ మెడికల్ కేర్, క్యాజువాలిటీ, ఐసీసీయూ, ఆపరేషన్ థియేటర్లు, తదితర వాటిని ప్రతి మూడు గంటలకోసారి శుభ్రం చేయాలి. అలాగే మిగతా వార్డులను రోజుకు 4 నుంచి 6సార్లు క్లీనింగ్ చేయాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులు ప్రస్తుతం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్లో 50 ఏళ్లు నిండిన వారిని కొద్దిరోజులుగా విధులకు దూరంగా పెట్టారు. ప్రశ్నించిన వారి పట్ల ఏజెన్సీ ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. దీంతో సదరు కార్మికులు తమను విధుల్లో కొనసాగించాలని కోరుతూ ఆందోళన బాటపట్టారు. కొత్తగా తీసుకొచ్చిన కార్మికులను పనిచేయకుండా అడ్డుకుంటున్నారు.
ప్రజారోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం
పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను పద్మావతి ఏజెన్సీ పక్కన పెట్టేసింది. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసినా డోంట్‌కేర్ అంటోంది. మెడిసిన్, లేబర్, గైనిక్, ఈఎన్‌టీ, సర్జరీ, ఆర్థో, పల్మనాలజీ, సైకియాట్రీ, వివిధ ఆపరేషన్ థియేటర్లను శుభ్రం చేయడం లేదు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెత్తాచెదారం, మెడికల్ వేస్ట్‌లతో వార్డులు కంపు కొడుతున్నాయి. రోగులకు వినియోగించిన పరికరాలు, దూది, ముక్కలు, సిరంజీలు, క్యాన్‌లా వంటివి ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. సాధారణంగా 5 రకాల డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలి. కానీ వార్డుకు ఒకటి లేదా రెండు డస్ట్‌బిన్లు మాత్రమే ఉంచారు. వార్డుల నుంచి చెత్తను అట్టపెట్టెల్లో వేసుకుని తీసుకెళ్తున్నారు. ఇక ఆపరేషన్ థియేటర్లలో ప్రాణాంతక కేసులకు సంబంధిన వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో ఖననం చేయాలి. కానీ అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. లేబర్ వార్డులో ప్లాస్టిక్ కవర్లలో వ్యర్థాలను వేయిస్తున్నారు.
ఏజెన్సీ తీరుతో పీజీ సీట్లకు ఎసరు!
ప్రభుత్వ వైద్య కళాశాలలో యూజీ, పీజీ సీట్ల సంఖ్యను అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని మంజూరు చేస్తారు. ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. దీన్ని గమనిస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) అనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఎన్‌ఏబీహెచ్ మార్గదర్శకాల ప్రకారం అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పారిశుధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీని రద్దు చేసే పరిస్థితి ఉంటుంది. రెండు నెలలుగా ఆస్పత్రిలో శానిటేషన్ అట్టర్ ఫ్లాప్ అయినా ఉన్నతాధికారులు చక్కదిద్దే ప్రయత్నం చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది
పద్మావతీ..ఏమిటీ దుర్గతి?!
పద్మావతీ..ఏమిటీ దుర్గతి?!
పద్మావతీ..ఏమిటీ దుర్గతి?!


