లారీ ఢీ.. రెండు కాళ్లు కోల్పోయిన వృద్ధుడు
యాడికి: లారీ డ్రైవర్ అజాగ్రత్త ఓ వృద్ధుడికి శాపంగా మారింది. ప్రమాదంలో రెండు కాళ్లనూ వృద్ధుడు కోల్పోయాడు. వివరాలు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన 83 ఏళ్ల గంధోడి నారాయణ కుమారులు బస్టాండు ప్రాంతంలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దుకాణం వద్దకు నారాయణ నడుచుకుంటూ బయలుదేరాడు. తాడిపత్రి వైపు నుంచి బళ్లారికి వెళుతున్న లారీ డ్రైవర్ స్థానిక ఓ హోటల్ వద్ద ఆపే క్రమంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న నారాయణను ఆనుకుని ముందుకు పోనిచ్చాడు. దీంతో నారాయణ అదుపు తప్పి కిందపడడంతో అతని రెండు కాళ్లపై లారీ వెనుక చక్కాలు దూసుకెళ్లాయి. రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న వృద్ధుడి కుమారులు వెంటనే కారులో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి క్షతగాత్రుడిని తరలించారు. లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు.


