యువకుడి దుర్మరణం
శింగనమల(నార్పల): ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు...నార్పల మండలం మూగేతిమ్మంపల్లికి చెందిన శేఖర్ కుమారుడు సతీష్(21) ఫొటోగ్రాఫర్ వృత్తిలో కొనసాగుతూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో ఆదివారం తాడిపత్రిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు ఫొటోలు తీసేందుకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని అదే రోజు రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. నాయనపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కరెంట్ షాక్‌తో
యువకుడి మృతి
ఆత్మకూరు: విద్యుత్ షాక్‌కు గురై ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (32) మృతి చెందాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయంతో పాటు కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమవారం పొలం పనికి వెళ్లేందుకు ఉదయాన్నే నిద్రలేచి బాత్రూమ్‌లోకి వెళ్లిన చంద్రశేఖర్... ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ తగిలి విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని జీజీహెచ్‌కు తీసుకెళ్లడంతో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఆత్మకూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దుర్మరణం


