మృత్యువులోనూ వీడని బంధం
రాయదుర్గంటౌన్: పెళ్లయిన నాటి నుంచి ఆ దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఏడు పదుల వయసులోనూ కష్ట, నష్టాలు కలిసి పంచుకున్నారు. చివరకు మృత్యువులోనూ ఒక్కటిగానే కలిసిపోయారు. రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని కొనసాగరం గ్రామానికి చెందిన హరిజన తిప్పన్న (72)కు కణేకల్లు మండలం గోపులాపురం గ్రామానికి చెందిన తిప్పమ్మ (68)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి పల్లేపల్లిలో నివాసముంటూ వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య తిప్పమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంచాన పడింది. ఇదే దిగులుతో భర్త తిప్పన్న బాధపడుతూ వచ్చాడు. సోమవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో తిప్పన్న మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక అదే రోజు ఉదయం 10 గంటలకు తిప్పమ్మ తుదిశ్వాస విడిచింది. ఐదు గంటల వ్యవధిలోనే దంపతులిద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. దంపతులిద్దరి అంత్యక్రియలను గ్రామస్తులు, బంధువులు కలిసి ఘనంగా నిర్వహించి తుది వీడ్కోలు పలికారు.


