కవలలకు జన్మనిచ్చి కానరాని లోకాలకు..
కళ్యాణదుర్గం: కవలలకు జన్మనిచ్చిన తల్లి తనివితీరా పిల్లలను చూసుకోకుండానే ఆరోగ్యం విషమించి కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఆదివారం వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు... బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన శివ, గంగమ్మ (25) దంపతులు. శివ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత గంగమ్మ గర్భం దాల్చింది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అప్పటి నుంచి గంగమ్మ క్రమం తప్పకుండా ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకుంటోంది. ఈ నెల 12న పురిటినొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిశీలించిన వైద్యులు సిజేరియన్ చేసి ఇద్దరు కవల(ఆడశిశువు)లను బయటకు తీశారు. బరువు తక్కువగా ఉండటంతో శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచారు. సాయంత్రం తర్వాత గంగమ్మకు బ్లీడింగ్ మొదలైంది. ఎంతకూ ఆగకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అంబులెన్స్‌లో అనంతపురం సవీర ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య సేవలు అందించినప్పటికీ కోలుకోలేకపోయింది. ఆదివారం ఉదయం గంగమ్మ మృతి చెందింది. పెళ్లయిన చాలా ఏళ్లకు గర్భం దాల్చి.. పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చి ఇలా దూరమైపోతివా తల్లీ అంటూ కుటుంబ సభ్యులు రోదించారు. పసికందులకు తల్లి లేకుండా చేస్తివా దేవుడా.. ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించారు. అనంతరం మృతదేహాన్ని గంగవరం తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఆరోగ్యం విషమించి బాలింత మృతి


