అవమానించాడని హతమార్చారు
పుట్టపర్తి టౌన్: మూడు నెలల క్రితం అమడుగూరు పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న రైతు హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడించారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపురం జిల్లా బాగేపల్లి తాలూకా హెబిలిదేవరవంక గ్రామానికి చెందిన రైతు ముత్తప్ప తన అన్న కుమార్తెతో కర్ణాటకలోని చామాలవారిపల్లికి చెందిన సోమశేఖర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సోమశేఖర్‌ను ముత్తప్ప చెప్పుతో కొట్టించాడు. ఈ అవమానాన్ని తాళలేని సోమశేఖర్ అప్పటికే ముత్తప్పతో భూతగాదా ఉన్న బాగపల్లి తాలూకా కొత్తూరుకు చెందిన రైతు సురేష్‌తో జత కట్టాడు. అనంతరం ఇద్దరూ కలసి ఎలాగైనా ముత్తప్పను హతమార్చాలని నిర్ణయించుకుని బాగేపల్లి తాలూకా బోయపల్లికి చెందిన ఆనంద్ సహకారం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 3న అమడగూరు మండలం ఆకులవారిపల్లి శివారున టమాట పంట వద్ద కాపలాకు వెళ్లిన ముత్తప్పను దారుణంగా హతమార్చి ఉడాయించారు. ఘటనపై ముత్తప్ప భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమడగూరు పీఎస్ పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించి, ఆదివారం ఉదయం ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన నల్లమాడ సీఐ నరేంద్రరెడ్డి, ఓడీచెరువు పీఎస్ సిబ్బంది లోకేశ్వర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డిని అభినందించారు.
రైతు హత్య కేసులో వీడిన మిస్టరీ
ముగ్గురి అరెస్ట్.. నిందితులందరూ
కర్ణాటక వాసులే
వివరాలు వెల్లడించిన శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్


