సర్వేలు మొదలు ప్రతి పనికీ చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉ
అనంతపురం అర్బన్: చంద్రబాబు సర్కార్ సచివాలయ ఉద్యోగులపై మోయలేని భారం మోపుతోంది. పది మంది చేసే పని ఒకరితో చేయిస్తూ తీవ్రవేదనకు గురిచేస్తోంది. సచివాలయ ఉద్యోగులు ఏకంగా 14 సర్వేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు క్లిష్టమైన, కీలకమైన బీఎల్‌ఓలుగానూ వ్యవహరిస్తున్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఓటరు మ్యాపింగ్ బాధ్యతలను అప్పగించి మరింత భారం మోపారు.
సర్వేలు ఇలా...
సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. ఇలా ఏకంగా 14 సర్వేలతో పాటు బీఎల్‌ఓ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సర్వేల విషయానికొస్తే పీ–4, వర్క్ ఫ్రమ్ హోమ్, అప్‌డేట్ ఈ–కేవైసీ, హౌస్ హోల్డ్ డేటా, అప్‌డేట్ మొబైల్ సర్వే, ఫ్యామిలీ మైగ్రేషన్, ఇతర శాఖల ఈ–కేవైసీ, వాట్సాప్ మన మిత్ర, ఆధార్ సీడింగ్ పర్ వాహన మిత్ర, కౌశలం సర్వే, హౌస్‌హోల్డ్ ఎడిట్ సర్వే, రైస్ కార్డు పంపిణీ, వాట్సాప్ డోర్ టూ డోర్ ప్రచారం, పింఛన్ల వెరిఫికేషన్ చేస్తున్నారు.
బీఎల్‌ఓ బాధ్యతలు
సర్వేలతో పాటు బీఎల్‌ఓ విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటరు చేర్పునకు ఫారం–6, ఓటరు తొలగింపునకు ఫారం–7, వివరాల మార్పులు, చేర్పులకు ఫారం–8 స్వీకరణ నిరంతర ప్రక్రియ. త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనున్న నేపథ్యంలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ కూడా వారికి అప్పగించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల మ్యాపింగ్ చేయాలి.
బాధను బయటకు చెప్పుకోలేక..
సర్వేలు, ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని... ఆ బాధను కూడా బయటకు చెప్పుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నామని పలువురు సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. సమస్యలను, ఇబ్బందులను బయటకు చెబితే శాఖాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
బహుమతిగా షోకాజ్ నోటీసులు
ఓటరు మ్యాపింగ్ శాతం తగ్గితే సచివాలయ ఉద్యోగులు షోకాజ్ నోటీసులను బహుమతిగా అందుకుంటున్నారు. ఒకవైపు రెగ్యులర్ సర్వేలు నిర్వహిస్తూ... మరోవైపు ఇంటింటికీ వెళ్లి ఓటరు మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులు ఎంతలా పని ఒత్తిడికి గురవుతున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోకపోగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారంటూ పలువురు సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు.
సచివాలయ ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి
ఏకంగా 14 సర్వేలు నిర్వహించాల్సిన పరిస్థితి
తాజాగా ఓటరు మ్యాపింగ్‌తో మరింత భారం
మ్యాపింగ్ తగ్గితే బహుమానంగా షోకాజ్ నోటీసులు
ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగుల ఆవేదన
సర్వేలు మొదలు ప్రతి పనికీ చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉ


