వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
అనంతపురం సిటీ: పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఎస్‌సీఆర్‌టీ బృందం రూపొందించిన వంద రోజుల ప్రణాళిక, స్టడీ మెటీరియల్‌ను క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ గురువారం విడుదల చేశారు. డీఈఓ ప్రసాద్‌బాబు, డీసీఈబీ సెక్రటరీ గంధం శ్రీనివాసులు పాల్గొన్నారు.
నేడు షీప్ సొసైటీల ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీస్) ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడానికి పశు సంవర్థకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతగా ఈనెల 5న 55 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించగా వివిధ కారణాలతో 13 సొసైటీలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండో విడతలో కూడా పలు సొసైటీలకు ఎన్నికలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం తోపుదుర్తి, అమ్మవారిపేట, కాలువపల్లి, టి.కొత్తపల్లి, చెర్లోపల్లి, దోసులుడికి, గొల్లలదొడ్డి, శీబాయి, వైసీ పల్లి, మలయనూరు, గొల్లపల్లి, నడిమిదొడ్డి, జి కొట్టాల, సింగనగుట్టపల్లి, పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి, జి.కొత్తపల్లి, బొమ్మేపర్తి, అయ్యవారిపల్లి, పీసీ ప్యాపిలి, కాటికానికాలువ, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం మామిళ్లపల్లి, పర్వతదేవరపల్లి, కొడపగానిపల్లి, రామస్వామితాండా, నసనకోట, పి.కొత్తపల్లి, ఆత్మకూరు సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల సత్వర పరిష్కారం
అనంతపురం క్రైం: అహుడా పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని అహుడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చిన అర్జీలు ఎక్కువకాలంగా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. లేఅవుట్ ఆమోదించిన తర్వాత మూడేళ్లు గడిచినా చెప్పిన విధంగా అభివృద్ధి పనులు పూర్తి చేయని డెవలపర్లు, రియల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అహుడా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొన్నారు.
టెట్‌కు రెండో రోజు 946 మంది హాజరు
అనంతపురం సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రెండో రోజైన గురువారం మొత్తం 1025 మందికి 946 మంది హాజరయ్యారని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 553 మందికి గాను 513 మంది మాత్రమే హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 472 మందికి గాను 433 మంది పరీక్ష రాశారు. 39 మంది డుమ్మా కొట్టారని డీఈఓ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ
కార్యకర్తపై దాడి
విడపనకల్లు: వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీపీకి చెందిన కార్యకర్త దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఉండబండలో గురువారం రాత్రి వైఎస్సార్‌సీపీ కార్యకర్త గోపాల్ తాను వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తానని, టీడీపీకి చెందిన ఉప్పర ఎర్రిస్వామితో చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఎర్రిస్వామి కట్టెతో తలపై కొట్టడంతో గోపాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు పాల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి


