49 చెరువులకు నీటి సరఫరా లేనట్టే?
● కుడికాలువ నీటి కోసం
ఎదురు చూస్తున్న రైతులు
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడికాలువ కింద ఉన్న ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న 49 చెరువులకు ఇరిగేషన్ అధికారులు ఇప్పట్లో నీటిని సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదు. కూడేరు మండలం జల్లిపల్లి వద్ద కుడికాలువ 4వ కిలో మీటర్ వద్ద గతంలో చేసిన మరమ్మతు పనులు నాసిరకంగా ఉండడంతో నీటి ప్రవాహానికి కాలువ గట్టు భారీగా కోతకు గురై తెగిన విషయం తెలిసిందే. కాలువ గట్టు మరమ్మతులకు సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతుందని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్, ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఒకవేళ మరమ్మతు పనులు మొదలెట్టినా కనీసం 15 రోజులు సమయం పడుతుంది.
కుడి కాలువ గేట్లదీ సమస్యే
కుడి కాలువకు నీటిని విడుదల చేసే గేట్లు కూడా పైకి లేవకుండా మొరాయిస్తున్నాయి. గత నెల 15న కుడి కాలువకు నీటి విడుదలకు ఇరిగేషన్ అధికారులు సిద్ధ పడ్డారు. గేట్లు మరమ్మతు చేపట్టి నీటి విడుదల చేద్దామని అధికారులు 22న ట్రయల్ చూశారు. కానీ గేటు పైకి లేవలేదు. నాటి నుంచి మెకానికల్ నిపుణులు వచ్చి గేట్లు పైకి లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తుంగభద్ర డ్యాం గేటును డిజైన్ చేసిన మెకానికల్ నిపుణులు కన్నయ్య నాయుడు సూచనలతో మరమ్మతులు చేపట్టగా ఈ నెల 1న గేట్లు పైకి లేవడంతో 700 క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు వదులుతూ వచ్చారు. కుడి కాలువ మొత్తం 112 కిలోమీటర్లు ఉంది. 7వ తేదీ నీరు 80వ కిలో మీటరుకు చేరగానే జల్లిపల్లి వద్ద గట్టు తెగింది. డ్యాం నుంచి నీరు వృథాగా వెళ్లకుండా అధికారులు 9వ తేదీ గేట్లను కిందికి దించారు. తెగిన గట్టుకు మరమ్మతు చేపట్టాక నీటి విడుదలకు గేట్లు పైకి లేస్తాయో.. లేదో ? తెలియని పరిస్థితి. కాబట్టి కుడి కాలువ కింద 49 చెరువులకు నీటి సరఫరా ఎప్పుడవుతుందో చెప్పలేని పరిస్థితి. 49 చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులు, రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు.


