ప్రజాస్వామ్యానికి పాతర
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం కోసం పరిటాల కుటుంబం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. బలంలేకున్నా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక బరిలో నిలిచి.. వైఎస్సార్‌సీపీకి చెందిన కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను ప్రలోభాలకు గురి చేశారు. గురువారం జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో సాయిలీలకు టీడీపీ కండువా కప్పి దౌర్జన్యంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎంపీపీగా ఏకగ్రీవం చేశారు.
బలం లేకున్నా...బరిలో నిలిచి
రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా... అందులో పేరూరు–1, పేరూరు–2, మాదాపురం, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, రామగిరి, కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రిలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కాగా, రామగిరి ఎంపీటీసీ సభ్యురాలు మీనుగ నాగమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే 2024 డిసెంబరులో ఆమె అనారోగ్యంతో మృతి చెందగా... ఎంపీపీ స్థానం దక్కించుకునేందుకు పరిటాల కుటుంబం కుట్రలు, కుతంత్రాలకు తెరతీసింది. తమ పార్టీ తరఫున మహిళా ఎంపీటీసీలు లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు.
నాలుగుమార్లు వాయిదా
టీడీపీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్ ఘటనలతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నాలుగుసార్లు వాయిదా పడింది. దీంతో మరోసారి అధికారులు ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వగా టీడీపీ నేతలు అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారు.
దాడులు...దౌర్జన్యాలే లక్ష్యం..
రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి రామగిరి మండలంలోని వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇళ్లు, వాహనాలు, పొలాల్లోని పచ్చని చెట్లను లక్ష్యంగా చేసుకొని రోజూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 30వ తేదీన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యపై పరిటాల సమీప బంధువులు దాడి చేసి హతమార్చారు. చివరకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ కప్పల సాయిలీలను భయపెట్టి పార్టీలో చేర్చుకున్నారు. గురువారం జరిగిన ఎన్నికలో ఆమెను అప్రజాస్వామికంగా ఎన్నిక చేసుకుని సంబరపడుతున్నారు.
రామగిరి ఎంపీపీ ఎన్నికలో పరిటాల నిసిగ్గు రాజకీయం
వైఎస్సార్ ఎంపీటీసీలకు ప్రలోభాలు, బెదిరింపులు
కుంటిమద్ది ఎంపీటీసీ సాయిలీలకు బలవంతంగా పచ్చకండువా
ఎంపీపీగా గెలచాలమంటూ సంబరాలు


