అరాచక శక్తుల ‘పురం’ | - | Sakshi
Sakshi News home page

అరాచక శక్తుల ‘పురం’

Nov 16 2025 7:46 AM | Updated on Nov 16 2025 7:46 AM

అరాచక శక్తుల ‘పురం’

అరాచక శక్తుల ‘పురం’

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: హిందూపురంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయి. ప్రశ్నించిన గొంతులను నొక్కేస్తూ ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురాన్ని అరాచక శక్తుల చేతిలో పెట్టి సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పీఏల అరాచకాలను ప్రశ్నిస్తోన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ప్రశ్నించే పాత్రికేయులపైనా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.

వైఫల్యాలను ఎత్తిచూపడం ఓర్వలేకనే..

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూపురం నియోజకవర్గంలో అక్రమాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే పీఏల ఆగడాలు ఎక్కువై పోయాయి. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన టీడీపీ నేతలు, కార్యకర్తలతో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రతి మద్యం దుకాణంలోనూ ఎమ్మెల్యే పీఏలకు వాటాలున్నాయి. దీనికితోడు పోలీసులను ఇష్టానుసారం వినియోగించడంతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోయాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. సహజ వనరులు కొల్లగొడుతున్నారు. దీంతో టీడీపీపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఇదే క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు విశేష స్పందన లభిస్తోంది. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ‘పచ్చ’ నేతలు బరితెగిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం హిందూపురంలో ఏకంగా వైఎస్సార్‌ సీపీ కార్యాలయంపై దాడి చేశారు. రాడ్లు, రాళ్లతో పార్టీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. అడ్డుకున్న పార్టీ నేతలు లోకేష్‌, దివాకర్‌రెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. ఎమ్మెల్యే పీఏలే అల్లరి మూకలతో దాడులు చేయించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హిందూపురం నియోజకవర్గవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అవినీతి తాండవం...

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూపురం నియోజకవర్గంలో అవినీతి తాండవం చేస్తోంది. హిందూపురం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రత్యేక నిధులను కొల్లగొడుతూ జేబులు నింపుకుంటున్నారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. చిలమత్తూరు మండలంలో సొంత అవసరాలకు పొలాల మధ్య ప్రభుత్వ నిధులతో రోడ్లు వేసుకుంటున్నారు. చెరువుల్లో మట్టిని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. సీసీ రోడ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

హిందూపురంలో పూర్తిగా లోపించిన

శాంతిభద్రతలు

ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోస్తున్న ‘తమ్ముళ్లు’

వైఎస్సార్‌ సీపీ కార్యాలయంపై దాడితో ఉలిక్కిపడ్డ ప్రజలు

బాలయ్య ఇలాకాలో

ఇప్పటికే అవినీతి తాండవం

పచ్చ నేతల దాడులు, దౌర్జన్యాలతో

బెంబేలెత్తుతున్న ప్రజలు

వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై

దాడి గర్హనీయం

అనంతపురం అర్బన్‌: హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేయడం గర్హనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్‌, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, వేమయ్య యాదవ్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే ప్రతి విమర్శల ద్వారా సమాధానం చెప్పాలే కానీ దాడులకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement