దశ మారని స్కిట్
అనంతపురం: స్కిట్ (శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కళాశాల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల జేఎన్‌టీయూ (ఏ) పరిధిలోకి వచ్చిన సమయంలో మళ్లీ కళాశాల పూర్వ వైభవం సంతరించుకుంటుందని అందరూ భావించారు. అయితే, ప్రచారం కల్పించడంలో వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం వెరసి ఆదిలోనే హంసపాదుగా తయారైంది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పేరున స్వామివారి దివ్య సన్నిధికి సమీపంలో ‘స్కిట్’ను 1997–98లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఏకై క ఇంజినీరింగ్ కళాశాల కావడం.. నాణ్యమైన బోధన, మంచి ఫలితాలు వస్తుండడంతో అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. అయితే, 2013 నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది. 2016 నాటికి ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలు అడ్మిషన్లే లేవు. కళాశాలలో 29 మంది బోధన, 36 మంది బోధనేతర ఉద్యోగులుండడంతో ఇటీవల 33 సంవత్సరాల లీజుకు జేఎన్‌టీయూ (ఏ)కు ఇస్తూ కాన్‌స్టిట్యూట్ కళాశాలగా నిర్దేశిస్తూ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
42 మంది విద్యార్థులే అడ్మిషన్..
2025–26 విద్యా సంవత్సరానికి గాను ఏపీఈఏపీసెట్ ద్వారా ‘స్కిట్’లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. 70 మందికి సీట్లు కేటాయించగా కేవలం 42 మంది రిపోర్ట్ చేసు కోవడం గమనార్హం. దీంతో ‘స్కిట్’ క్యాంపస్‌లో కాకుండా అన్నమయ్య జిల్లాలోని కలికిరి జేఎన్‌టీయూలో వర్సిటీ అధికారులు తరగతులను ప్రారంభించారు. ‘స్కిట్’లో భవనాల మరమ్మతుల నేపథ్యంలో కలికరికి మార్చినట్లు చెబుతున్నారు. అయితే, ‘స్కిట్’ అధ్యాపకులకు జీతాలు ఇవ్వడం వృథా అని భావించే కలికిరికి మార్చారని, జేఎన్‌టీయూ ఉన్నతాధికారులకు ‘స్కిట్’ను తీసుకోవడం ఇష్టం లేకనే పొమ్మనలేక పొగ పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ‘స్కిట్’ భవి తవ్యంపై నీలినీడలు కమ్ముకున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది హైకోర్టును ఆశ్రయించగా, నెలకు కనీసం రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా ‘స్కిట్’ కార్యకలాపాలను కలికిరికి మార్చడంతో మళ్లీ ఆందోళన మొదలైంది.
● తాము శ్రీకాళహస్తిలోని కళాశాలను ఎంపిక చేసుకోగా, నేడు కలికిరిలో చదవాలని చెప్పడం ఎంత వరకూ సమంజసమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.కళాశాల క్యాంపస్‌నే మార్చివేసి ఇబ్బందికి గురిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతులు చేయాలి
స్కిట్ కళాశాలలో భవనాలను మరమ్మతులు చేయాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో కలికిరి కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నాం. మరమ్మతులు పూర్తయ్యాక శ్రీకాళహస్తిలోనే తరగతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
– సుదర్శనరావు, వీసీ, జేఎన్‌టీయూ (ఏ)
కళాశాలలో చేరేందుకు కేవలం 70 మంది విద్యార్థుల ఆసక్తి
వీరిలోనూ 42 మందే జాయిన్
జేఎన్‌టీయూ (ఏ) ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే దుస్థితి!


