కుట్రలకు బెదరం.. మరింత బలపడతాం
● కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కళ్యాణదుర్గం: స్థానిక మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్‌కుమార్ పదవి రద్దుపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి తలారి రాజ్‌కుమార్, కౌన్సిలర్లు సురేష్, లక్ష్మన్న, పరమేశ్వరప్ప, పార్టీ మున్సిపల్ కన్వీనర్ సుధీర్, రూరల్ మండల కన్వీనర్ గోళ్ల సూరి, కదిరిదేవరపల్లి హనుమంతరాయుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ను తొలగించారన్నారు. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని, నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడతామని తెలిపారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ టీడీపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. కౌన్సిల్ సమావేశాలకు రావడం లేదనే సాకు చూపి చైర్మన్ పదవిని రద్దు చేస్తున్నట్లు కమిషనర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. కౌన్సిల్ మీట్ పెట్టేందుకు కమిషనర్ సహకరించడం లేదంటూ పలుమార్లు ఆర్డీఓ, కలెక్టర్, మున్సిపల్ ఆర్డీకు సైతం చైర్మన్ విన్నవించారని గుర్తు చేశారు. ఈ అంశంపై పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య సూచనలతో చట్టపరంగా న్యాయ పోరాటం సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు, నియోజకవర్గ అధ్యక్షుడు చరణ్, కిరీటియాదవ్, పూజల మారుతి, షెక్షావలి, దొడగట్ట మారుతి, జాకీర్, రాజు, నరేష్, మల్లి పాల్గొన్నారు.
ఎంఈఓలకు షోకాజ్ జారీ
బ్రహ్మసముద్రం : మండలంలోని గొంచిరెడ్డిపల్లి పాఠశాలలో భోగస్ ఎన్‌రోల్‌మెంట్ అంశంపై మండల విద్యాశాఖాధికారులు ఓబుళపతి, కృష్ణానాయక్‌కు జిల్లా విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే ఘనటకు సంబంధించి ఆ పాఠశాల ఉపాధ్యాయుడిని రెండు రోజుల క్రితం సస్సెండ్ చేసిన విషయం తెలిసిందే.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పామిడి: స్థానిక పాత బస్టాండ్‌లోని జెండా కట్ట వద్ద వాహనం ఢీకొన్ని పామిడికి చెందిన షాషావలి (45) మృతిచెందాడు. గురువారం సాయంత్రం టీ తాగేందుకు వచ్చిన ఆయనను గార్లదిన్నె మండలం కల్లూరు నుంచి వేగంగా వచ్చిన తుపాను వాహనం ఢీకొంది. ఘటనలో తలకు, కాలికి తీవ్ర గాయమైన షాషావలిని పక్కనే ఉన్న సీహెచ్‌సీకి అక్కడున్న వారు తీసుకెళ్లారు. పరిస్థితి విషమిస్తుండడంతో అనంతపురంలోని ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడ చికిత్సకు స్పందించిక ఆయన మృతిచెందాడు. ఘటనపై సీఐ యుగంధర్ కేసు నమోదు చేశారు.
వ్యక్తి బలవన్మరణం
కదిరి అర్బన్: మండలంలోని బాలప్పగారిపల్లికి చెందిన బాలూనాయక్ (38) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో ప్రమాదవశాత్తు కాలు విరగడంతో చికిత్స పొందాడు. అప్పటి నుంచి తరచూ అనారోగ్య సమస్యలు వెన్నాడుతుండడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


