అనంతసేనడికి శ్రీనివాసుని అండ!
రాయదుర్గం/అనంతపురం టవర్‌క్లాక్: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన రాయదుర్గం నియోజకవర్గంలోని మురడి ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడిగా తిరిగి అనంతసేనను తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఇచ్చిన లేఖ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. 2022, జూలై 12న ఆలయంలో రాసలీలలు సాగిస్తూ అనంతసేన పట్టుబడడంతో భక్తుల డిమాండ్ మేరకు దేవదాయశాఖ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలు నిర్ధారించుకున్న అనంతరం అతన్ని అర్చకత్వ విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి అర్చకుడిగా తిరిగి వచ్చేందుకు అనంతసేన చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుతో సిఫారసు లేఖ తీసుకుని విజయవాడలోని దేవదాయశాఖ కార్యాలయంలో అనంతసేన సమర్పించాడు. ఈ విషయం కాస్త బహిర్గతం కావడంతో భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయ ప్రతిష్టను మంట కలిపిన అనంతసేనను తిరిగి అర్చకుడిగా ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. అతని రాసలీలలు తెలిసి సిఫారసు లేఖ ఎలా ఇచ్చారని, అధికారముంది కదా అని కామాంధుడికి ఆలయ అర్చకత్వం బాధ్యతలు అప్పగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పందించి తన సిఫారసు లేఖను వెనక్కు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఇదే అంశంపై బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కాలవ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కామాంధుడైన అర్చకుడికి ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. అనంతసేనను తిరిగి అర్చకుడిగా నియమిస్తే ఎమ్మెల్యే కాలవకు కనీస మర్యాద కూడా ఉండదన్నారు. దేవుడి సేవకు మహిళా భక్తులు దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన సిఫారసు లేఖను తక్షణమే వెనక్కు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు, అంకే కుళ్లాయప్ప, అనంతపురం అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డిపల్లి నరేంద్ర, హరి ప్రసాద్, జిలాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
తొలగించిన అర్చకుడిని తిరిగి
తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫారసు లేఖ
ఎమ్మెల్యే కాలవ తీరుపై మండిపడుతున్న బీఎస్పీ నాయకులు
ఆలయంలో రాసలీలలు సాగించిన వ్యక్తిని అర్చకుడిగా ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం


