అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి

Oct 30 2025 7:57 AM | Updated on Oct 30 2025 7:57 AM

అట్రా

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి

అనంతపురం అర్బన్‌:‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి. అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలు చేసినప్పుడే అది సాధ్యం’’ అని కలెక్టర్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి ఆయన జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్మశాన వాటికల ఏర్పాటుకు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పరిష్కార వేదికలో ఎస్సీ, ఎస్టీ సమస్యలకు సంబంధించి అందిన అర్జీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఉల్లంఘనలకు తావివ్వకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, డీఆర్‌ఓ ఎ.మలోల తదితరులు పాల్గొన్నారు.

బలహీన వర్గాల అభివృద్ధికి కృషి

ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీ కాంపోనెంట్‌ మానిటరింగ్‌ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు కచ్చితంగా ఖర్చు చేయాలన్నారు.

గుమ్మఘట్ట ఎంఈఓ రామచంద్రప్ప సస్పెన్షన్‌

అనంతపురం సిటీ: గుమ్మఘట్ట మండల విద్యా శాఖాధికారి(ఎంఈఓ)గా పని చేస్తున్న హరిజన రామచంద్రప్ప సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు బుధవారం విద్యా శాఖ కడప ప్రాంతీయ సంచాలకుడు శామ్యూల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా హరిజన రామచంద్రప్ప పనిచేశారు. ఆ సమయంలో నాడు–నేడు పథకం కింద మంజూరైన రూ. లక్షల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. తాజాగా విచారణాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఈఓ రామచంద్రను సస్పెండ్‌ చేస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ కార్యాలయ అధికారులు తెలిపారు. అయితే తనను ఏకపక్షంగా సస్పెండ్‌ చేశారంటూ ఎంఈఓ రామచంద్ర విలేకరులతో వాపోయారు.

నిద్ర మత్తు వీడిన సర్కారు

ఎట్టకేలకు పప్పుశనగ పంపిణీకి సిద్ధం

అనంతపురం అగ్రికల్చర్‌: కూటమి సర్కారు నిద్ర మత్తు వీడింది. జిల్లాలో ఎట్టకేలకు విత్తన పప్పుశనగ పంపిణీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రబీ రైతులకు రాయితీతో విత్తన పప్పుశనగ పంపిణీ చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో ఎట్టకేలకు పంపిణీకి సిద్ధమయ్యారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం వ్యవసాయశాఖ నుంచి ఏపీ సీడ్స్‌కు అనుమతులు జారీ అయ్యాయి. జిల్లాకు కేటాయించిన 14 వేల క్వింటాళ్ల జేజీ–11 రకం విత్తనాలు 25 శాతం సబ్సిడీతో ఇవ్వడానికి వీలుగా గురువారం నుంచి 17 మండలాల పరిధిలో 180 ఆర్‌బీకేల్లో రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ప్రకటించారు. తాడిపత్రి డివిజన్‌కు 4,850 క్వింటాళ్లు, ఉరవకొండ డివిజన్‌ 4,285, రాయదుర్గం డివిజన్‌ 2,465, గుత్తి డివిజన్‌ 1,200, కళ్యాణదుర్గం డివిజన్‌ 1,000, అనంతపురం డివిజన్‌కు 200 క్వింటాళ్ల చొప్పున కేటాయించారు. ఇందులో 7 వేల క్వింటాళ్లు సర్టిఫైడ్‌ సీడ్‌, మరో 7 వేల క్వింటాళ్లు ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ సీడ్‌ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, బెళుగుప్ప, బొమ్మనహాళ్‌, కణేకల్లు, డీ.హీరేహాళ్‌, గుత్తి, పెద్దవడుగూరు, శింగనమల, యాడికి, పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి, ఉరవకొండ,విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. క్వింటా పూర్తి ధర రూ.7,800 కాగా రాయితీ రూ.1,950 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,850 ప్రకారం చెల్లించాలి.

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి 1
1/2

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి 2
2/2

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement