వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌పై దాడి
పెద్దవడుగూరు: మండల కేంద్రమైన పెద్దవడుగూరులో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డిపై టీడీపీ కార్యకర్త ఈశ్వరరెడ్డి దాడికి తెగబడ్డాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భీమునిపల్లి, రావులుడికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో తన ఇంట్లో మాట్లాడుతుండగా మద్యం మత్తులో అక్కడకు చేరుకున్న ఈశ్వరరెడ్డి కవ్వింపు చర్యలకు దిగాడు. పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే తన పేరును పార్టీ ప్రతిపాదించిందని, వైఎస్సార్‌సీపీ తరఫున ఎవ్వరైనా నిలబడితే చంపుతానంటూ బెదిరించాడు. దీంతో శరభారెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామని, అప్పటి వరకూ ఎలాంటి గొడవలకు పోకుండా కలసిమెలిసి ఉందామని తెలిపాడు. దీంతో శరభారెడ్డిపై ఈశ్వరరెడ్డి దాడి చేశాడు. పక్కన ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించి, పట్టుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని పీఎస్‌కు తరలించారు. అనంతరం పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
యల్లనూరు: విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన పత్తికొండ పెద్దన్న (72)కు భార్య చంద్రమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తమకున్న పొలంలో పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వరి పంటకు నీరు పెట్టేందుకు బుధవారం ఉదయం భార్యతో కలసి పెద్దన్న పొలానికి వెళ్లాడు. స్తంభంపై ఉన్న లైనుకు మోటార్ వైర్లను తగిలించే క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు.
అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
బుక్కరాయసముద్రం: మండలంలోని వడియంపేట వద్ద ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీకేఎస్ పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ పుల్లయ్య వెల్లడించారు. ఈ నెల 6న కేశవరెడ్డి పాఠశాల క్యాష్ కౌంటర్‌లో నుంచి రూ. 2 లక్షల నగదును దుండగులు అపహరించారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారన్నారు. ఈ క్రమంలో నిందితులను గుజరాత్‌లోని వల్సార్ జిల్లాకు చెందిన రవి పవార్, భరత్ రాజారంగా గుర్తించి, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వారి ప్రాంతానికి వెళ్లి అదుపులోకి తీసుకుని వచ్చినట్లు వివరించారు. విచారణ అనంతరం నేరాన్ని అంగీకరించడంతో నిందితులను న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామన్నారు. కాగా, ఇదే కేసులో మనోహర్, పవార్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు సీఐ పుల్లయ్య తెలిపారు.
విద్యుత్ బిల్లులు సకాలంలో
చెల్లించాలి
అనంతపురం టౌన్: నెల వారీ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని వినియోగదారులకు విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోపు చెల్లిస్తే వచ్చే నెల బిల్లులో వినియోగదారుల రూ.25 అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ విషయాన్ని గుర్తించుకుని సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు.


