కక్ష గట్టి.. పదవి నుంచి తప్పించి!
● దుర్గం మున్సిపల్ చైర్మన్ రాజ్‌కుమార్ తొలగింపు
● ఎమ్మెల్యే అమిలినేని కక్ష సాధింపులపై సర్వత్రా విమర్శలు
కళ్యాణదుర్గం: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కక్ష సాధింపులు తారస్థాయికి చేరాయి. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్‌కుమార్‌పై కక్ష గట్టిన ఆయన తాజాగా పదవి నుంచి తొలగింపజేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. మున్సిపల్ అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపిస్తూ తొలగించడం గమనార్హం.
రూ.46 కోట్ల పనులకు అడ్డు లేకుండా..
ఇటీవల మున్సిపల్ పాలక వర్గం రూ.46 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు పంపింది. ప్రధానంగా రూ.16 కోట్లతో మున్సిపల్ కాంప్లెక్స్ భవనం, రూ.3 కోట్లతో మున్సిపల్ కార్యాలయం, రూ.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మల్టీ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణాలతో పాటు పలు చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర వాటి కోసం ప్రతిపాదించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే తమ అక్రమాలకు అడ్డంకిగా మారతాడని భావించి తప్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టార్గెట్ చేసిన కమిషనర్
కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేశారు. చైర్మన్ రాజ్‌కుమార్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యే ఏం చెబితే అదే చేస్తున్నారు. మున్సిపాలిటీ కౌన్సిల్ మీట్‌పై పలుమార్లు చైర్మన్, కౌన్సిలర్లు కమిషనర్‌ను కలిసినా తేదీలు ఖరారు చేయలేదు. ఎమ్మెల్యే ఏ డేట్ చెబితే అదే రోజు ఉంటుందని గతంలో ఆయన ప్రకటించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. తాజాగా ప్రిన్సిపల్ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో.. రెండు నెలల వ్యవధిలో రెండు కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నా చైర్మన్ జరపలేదని పేర్కొనడం గమనార్హం.
సాధారణ వ్యక్తికి చైర్మన్ పీఠం..
తోపుడు బండిపై కళింగర, బొప్పాయి, కర్భూజ పండ్లను పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే రాజ్‌కుమార్‌ను కౌన్సిలర్‌ను చేయడమే కాకుండా మున్సిపల్ చైర్మన్ పీఠం ఇచ్చి వైఎస్సార్ సీపీ గౌరవించింది. అలాంటి నిరాడంబర వ్యక్తిని అవమానకర రీతిలో తొలగింపజేసిన ఎమ్మెల్యేపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారు..
అగ్రవర్ణాల వ్యక్తులను అందలం ఎక్కించడం కోసమే చైర్మన్ పదవి నుంచి రాజ్‌కుమార్‌ను ఎమ్మెల్యే తొలగింపజేశారని కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు దుయ్యబట్టారు. కౌన్సిలర్లు సురేష్, గోపారం హేమావతి, కుర్రా రాము, ఈడిగ సుదీప్తి, ఎరుకుల తిప్పమ్మ, తిరుమల చంద్రమ్మ, లక్ష్మన్న, పరమేశ్వరప్ప, పూసల భాగ్యమ్మ, అర్చన, కో ఆప్షన్ సభ్యులు మమతా సురేష్, అప్జల్, సల్లా మారుతి పత్రికా ప్రకటన విడుదల చేశారు. పనికిమాలిన, లంచ గొండి కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజ మెత్తారు. కమిషనర్ పోస్టుకు అర్హత లేని వంశీకృష్ణ భార్గవ్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో వివాదాలకు తెర లేపారన్నారు. ఈయన పూర్తిగా టీడీపీ కార్యకర్త అని, తన పై అధికారులంటే కూడా ఏ మాత్రమూ భయం లేదన్నారు. అవినీతిని ప్రోత్సహించడంలో భాగంగానే కుట్రతో పదవిని రద్దు చేశారన్నారు.


