మట్టి మాఫియాకు అధికార అండ
● మాజీ మంత్రి శైలజానాథ్
అనంతపురం: జిల్లాలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్‌లో కూటమి అధికారంలోకి వచ్చాక ఎర్రమట్టిని తరలించి కాలనీ స్వరూపాన్నే మార్చేశారన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. మట్టి మాఫియాను ప్రశ్నించిన పత్రికా విలేకరులపైనా దాడులు చేస్తున్నారన్నారు. అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డి పల్లి, బుక్కరాయసముద్రం, ఆలమూరు మట్టి కొండలన్నీ మాఫియా మాయం చేసిందన్నారు. కృష్ణం రెడ్డిపల్లి వద్ద నుంచి రోజూ 150 నుంచి 200 టిప్పర్ల ఎర్రమట్టిని తరలిస్తున్నారన్నారు. వీటన్నింటినీ రవాణా, మైనింగ్ , రెవెన్యూ శాఖలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో 20 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వానికి రూ.20 కోట్లకు పైగా రాయితీ ఎగ్గొట్టినా పట్టించుకునే వారు లేరన్నారు. పెన్నానదికి గర్భశోకం, చిత్రావతి వధ అంటూ అధికార పార్టీకి వత్తాసు పలికే పత్రికల్లోనే కథనాలు వస్తున్నాయని, అయినా అధికారుల వైపు నుంచి చర్యలు లేవని అన్నారు.
పసలూరుకు వచ్చి చూడండి
గత ప్రభుత్వంలో పసులూరు వద్ద నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చి..మంచి లేఅవుట్ వేసి అధునాతంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఇప్పుడు అక్కడ కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రమట్టిని అక్రమంగా తరలించారన్నారు. కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు వచ్చి చూస్తే ఏ స్థాయిలో దారుణాలకు పాల్పడ్డారో తెలుస్తుందన్నారు. పసులూరు లేఅవుట్‌లో ఎర్రమట్టి తరలింపు అంశంపై బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినా.. ఇప్పటి దాకా ఎలాంటి చర్యలూ లేవన్నారు. అసలు కేసు ఏమైందో చెప్పేవారే లేరన్నారు. అక్రమార్కులపై చర్యలు కోసం వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, శింగనమల మండల కన్వీనర్ పూల ప్రసాద్, గార్లదిన్నె మండల కన్వీనర్ యల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


