నిగ్గు తేల్చకుండా గుడిసెల తొలగింపు
కూడేరు: మండలంలోని బ్రాహ్మణపల్లిలో సర్వేనంబర్ 93లో ఇంటి స్థలాలు కేటాయించాలంటూ 24 రోజుల క్రితం అఖిల భారత రైతు కూలీ సంఘం, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సుమారు 1,700 మంది పేదలు ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. వీరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బుధవారం వేకువజాము 3 గంటలకు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, 140 మంది పోలీసులతో రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని జేసీబీలతో గుడిసెలను నేలమట్టం చేయించారు. ఆ సమయంలో ఆ భూమి తమదేనంటున్న ఇద్దరు వ్యక్తులు వంద మంది ప్రైవేట్ సైన్యంతో పేదలను ఇష్టానుసారంగా లాగి పక్కకు పడేశారు. గుడిసెల్లోని సామగ్రిని పక్కకు తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా జేసీబీలను ఉసిగొల్పడంతో పేదలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి చెరువు భూమిగా ఉందని అలాంటి భూమి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా ఎలా ఇస్తారంటూ అధికారులను ఏఐకేఎంఎస్, న్యూడెమోక్రసీ నేతలు, పేదలు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. భూమి తమది అని చెప్పుకునే టీడీపీ నేతలకు అండగా అధికారులు నిలిచి తెల్లారేలోపు చీకట్లలోనే పని ముగించేసి చేతులు దులుపుకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బ్రాహ్మణపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో 2200 ఎకరాల శోత్రియం భూములు ఉన్నాయి. వీటిలో నెల్లూరు సెటిల్‌మెంట్ ఎంత, అందులో మిగులు భూమి ఎంత? సీలింగ్ చట్టం కింద ఎంత భూమి ఉంది. స్వాధీనం చేసుకున్న ఆ భూమి ఎక్కడుంది... ఏమైంది? ప్రైవేట్ వ్యక్తుల పేరుతో వందలాది ఎకరాల భూమిని ఎలా కేటాయిస్తారు? తదితర అంశాలపై వాస్తవాలు తేల్చకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని పేదలు వాపోయారు. కేవలం స్థానిక టీడీపీ నాయకులు వెంకటేశులు, నారాయణస్వామి అక్కడున్న 136 ఎకరాలు తమదేనంటూ నోటి మాటగా చెప్పడంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడబలుక్కొని ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
1,700 గుడిసెలను జేసీబీలతో కూలదోసిన రెవెన్యూ అధికారులు


