హిందూపురం... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రాతి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దాదాపు పుష్కర కాలం నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ, నియోజకవర్గ ప్రజలను పాలిస్తున్నది మాత్రం ఆయన కాదు.. ఆయన పీఏలు! 2014లో పీఏ శేఖర్ అవినీతి అరాచకాలతో చెలరేగిపోగా.. ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. దీంతో శేఖర్‌ను తొలగించారు. తర్వాత వీరయ్య, బాలాజీ, చిత్తూరు నుంచి సురేంద్ర, గుంటూరు నుంచి శ్రీనివాసులు పీఏలుగా చెలామణి అవుతున్నారు. వీరిలో ఇద్దరు పీఏలు ‘పురాన్ని’ గుప్పిట్లో పెట్టుకున్నారు. వీరు ఏది చెబితే బాలయ్య అదే చేస్తారు! చెప్పినవారికే పోస్టింగులు కట్టబెడతారు. పోస్టింగ్‌ను బట్టి రేటు ఫైనల్ చేస్తారు.
అవినీతి అడ్డా ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు!
హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అత్యంత కీలకం. ప్రభుత్వ భూములు భారీగా ఉన్న ప్రాంతం ఇదే. బాలయ్య పీఏ ఒకరు రూ.20 లక్షలు తీసుకుని ఓ సబ్ రిజిస్ట్రార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఆయనతో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు చేయించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ సస్పెండయ్యారు. తర్వాత ఆయన్నుంచే రూ.25 లక్షలు తీసుకుని సస్పెన్షన్ ఎత్తేసి, చిలమత్తూరులోనే పోస్టింగు ఇప్పించే ప్రయత్నం చేశారు. కానీ, కుదర్లేదు. చివరకు చిలమత్తూరులో కాకుండా కదిరిలో పోస్టింగ్ ఇచ్చారు. దీంతో తన రూ.25 లక్షలు వెనక్కి ఇవ్వాలని సదరు సబ్ రిజిస్ట్రార్ ఒత్తిడి చేయగా.. ‘‘పోస్టింగ్‌లో బాగా సంపాదించావ్... రూ.25 లక్షలు మళ్లీ అడుగుతున్నావా?’’ అంటూ బాలకృష్ణ పీఏ దబాయించారు. ఇదిలా ఉండగానే... మడకశిరలో రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మరో సబ్ రిజిస్ట్రార్‌తో రూ.50 లక్షలకు చిలమత్తూరు పోస్టింగ్‌పై బేరం కుదిరింది. దీనికి సంబంధించిన ఫైలు వేగంగా కదిలింది. రెండు, మూడు రోజుల్లో ఆయనకు నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
కమర్షియల్ ‘పోస్టింగ్’...
బాలకృష్ణ పీఏ ఒకరు రూ.30 లక్షలు తీసుకుని... హిందూపురం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(సీటీఓ)గా ఒకరికి పోస్టింగ్ ఇప్పించారు. ఈ అధికారి భారీ జరిమానాలతో వ్యాపారులను భయాందోళనలకు గురిచేసి తన వద్దకు రప్పించుకున్నారు. వారినుంచి డబ్బులు తీసుకుని జరిమానాలు తగ్గించారు. వసూళ్లు, ఇతర వ్యవహారాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో సీటీఓను కమిషనర్ సస్పెండ్ చేయగా.. సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ ఇక్కడే పోస్టింగ్ ఇచ్చేలా బాలకృష్ణ పీఏలు ప్రయత్నించారు. కానీ, కమిషనర్ ఒప్పుకోకుండా కడపకు పంపించారు. హిందూపురానికి అసిస్టెంట్ కమిషనర్‌గా సుర్రేందరెడ్డిని నియమించారు. అయితే, బాలకృష్ణ నేరుగా కమిషనర్ వద్దకెళ్లి సస్పెండైన సీటీఓనే కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ‘‘సస్పెండైన అధికారిని తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో లేదు. నేను ఆర్డర్స్ ఇవ్వలేను’’ అని కమిషనర్ తేల్చిచెప్పగా.. బాలకృష్ణ నేరుగా సీఎం దగ్గరకు వెళ్లి సస్పెండైన సీటీఓను తిరిగి తెప్పించుకున్నారు.
కల్తీ మద్యంలో చర్యలు.. నెలలో తిరిగి ఉద్యోగం
అనంతపురం స్క్వాడ్ తనిఖీల్లో లేపాక్షి, చిలమత్తూరులో కల్తీ మద్యం విక్రేతలు పట్టుబడ్డారు. ఇది కంపెనీల నుంచి తయారైంది. కర్ణాటక లిక్కర్ కాకుండా ‘థర్డ్’ (స్పిరిట్‌తో సొంతంగా తయారు చేసినది) కావడంతో కమిషనర్ విచారణ చేయించారు. సీఐ అండతోనే వ్యవహారం నడిచిందని తేలడంతో సస్పెండ్ చేయాలని భావించారు. కానీ, బాలకృష్ణ పీఏలలో ఒకరు అడ్డుపడ్డారు. దీంతో సీఐను కమిషనర్ ఆఫీస్‌కు అటాచ్ చేయగా.. నెలలోపే తిరిగి ఆ సీఐ అదే స్థానంలో పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈ వ్యవహారంలో అండగా నిలిచిన పీఏకు రూ.25 లక్షలకు ముట్టజెప్పారని ఎకై ్సజ్ శాఖలో చెబుతున్న మాట.
బాలయ్యకు తెలియకుండానే జరుగుతోందా?
హిందూపురంలో కేవలం మూడు శాఖల్లోని అవినీతి వ్యవహారాన్ని విశ్లేషిస్తేనే చాంతాడంత ఉంది. మరి... ఇదంతా బాలకృష్ణకు తెలియకుండా జరుగుతుందా? తెలిసినా చర్యలు తీసుకోవడం లేదంటే ఆయనకూ డబ్బు మూటలు వెళ్తున్నట్లే కదా? అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
మద్యం దుకాణాలన్నీ స్వాధీనం!
ఎకై ్సజ్ సీఐగా ఓ వసూళ్లరాయుడికి పోస్టింగ్ ఇచ్చారు. ఈయన ఎమ్మిగనూరులో రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. కర్నూలు జిల్లా పంచలింగాలలో ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను నియమించి వసూళ్లకు దిగారు. ఈ సీఐ అండతో బాలకృష్ణ ఇద్దరు పీఏలు హిందూపురంలోని మద్యం దుకాణాలన్నింటినీ బినామీ పేర్లతో దక్కించుకున్నారు. రెండు షాపులు ఇతరులకు (వీరిలో ఒకరు మహిళ) రాగా, ఒకరిని కిడ్నాప్ చేసి, ఓ మహిళను భయపెట్టి దుకాణాలను లాక్కున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడా లేనివిధంగా హిందూపురంలో బాటిల్‌పై రూ.10 ఎక్కువకు మద్యం విక్రయిస్తున్నారు. ఇందులో మళ్లీ ప్రతి నెలా మూమూళ్లు పీఏలకు వెళ్లాలి.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ఇలాకాలో అవినీతి తాండవం
ఏసీబీకి చిక్కిన అధికారులకే ఆదాయం ఉన్న శాఖల్లో పోస్టింగ్
రిజిస్ట్రేషన్, ఎకై ్సజ్, వాణిజ్య పన్ను శాఖల్లో అవినీతి అధికారులకే అందలం


