అమ్మో.. రామ్మోహన్‌ అక్రమాలు! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. రామ్మోహన్‌ అక్రమాలు!

Oct 29 2025 8:01 AM | Updated on Oct 29 2025 8:01 AM

అమ్మో.. రామ్మోహన్‌ అక్రమాలు!

అమ్మో.. రామ్మోహన్‌ అక్రమాలు!

బుక్కపట్నంలో ఇష్టారాజ్యంగా భూముల రిజిస్ట్రేషన్లు

అనంతపురం టౌన్‌/కళ్యాణదుర్గం: ప్రభుత్వ భూములను ఇష్టారీతిన రిజిస్ట్రేషన్‌ చేయడంతో పాటు కాసులకు కక్కుర్తి పడి ఓ స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి సస్పెన్షన్‌కు గురై మళ్లీ ‘దుర్గం’ సబ్‌ రిజిస్ట్రార్‌గా బాధ్య తలు తీసుకున్న రామ్మోహన్‌ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బుక్కపట్నంలో ఆయన చేసిన ఓ బాగోతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన తాన్‌సేన్‌ సింగ్‌ పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు. బాబా ఉన్న సమయంలో ఏడాదిలో పదుల సార్లు పుట్టపర్తి వచ్చేవాడు. ఆ క్రమంలోనే కొత్తచెరువు మండలం తిమ్మదేవరపల్లి సర్వే నంబర్‌ 153–2లోని 9.68 ఎకరాల భూమిని చెరువు నాగిరెడ్డి, చెరువు నరసింహారెడ్డి, నారాయణరెడ్డి నుంచి కొనుగోలు చేశాడు. డాక్యుమెంట్‌ నంబర్‌ 1309– 1999లో బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. అయితే, బాబా మరణించాక తాన్‌సేన్‌ సింగ్‌ పుట్టపర్తికి రావడం మానేశాడు. ఈ క్రమంలోనే ఆయన భూమిపై పుట్టపర్తికి చెందిన కొందరి కన్ను పడింది. 2022లో తాన్‌సేన్‌ సింగ్‌ నుంచి డాక్యుమెంట్‌ నంబర్‌ 8961–2022తో గుమ్మన మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. బోగస్‌ వ్యక్తులతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని అప్పట్లో దీనిపై పెద్ద దూమరం రేగింది. రిజిస్ట్రేషన్‌ డీఐజీ వద్ద, పోలీస్‌స్టేషన్లలో సైతం ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే అవేవి తనకు పట్టదన్నట్లు 2024 జూలైలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌ తీసుకున్న రామ్మోహన్‌ ఇదే భూమికి ‘ఎనీవేర్‌’ కింద 2024 ఆగస్టులో మహేశ్వరరెడ్డి నుంచి కేతిరెడ్డి నాగార్జునరెడ్డికి రిజిస్ట్రేషన్‌ చేశారు.

భారీగా ముడుపులు..

అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ రామ్మోహన్‌ భారీగా ముడుపులు తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. కాసుల కక్కుర్తితో ఉరవకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఎనీవేర్‌ కింద రిజిస్ట్రేషన్‌ పెట్టించి మరీ తతంగం ముగించిన ఆయన.. ఆ తర్వాత అవే రిజిస్ట్రేషన్ల రద్దుకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది.

పట్టుబట్టి వేయించుకున్న ఎమ్మెల్యే?

కళ్యాణదుర్గంలోనూ అక్రమాలకు పాల్పడి సస్పెండ్‌ అయిన సబ్‌ రిజిస్ట్రార్‌ రామ్మోహన్‌ను పట్టుబట్టి మరీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మళ్లీ అక్కడికే పోస్టింగ్‌ వేయించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.గతంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు కంపెనీకి సంబంధించి వెలుగు చూసిన ఈ– స్టాంప్‌ల కుంభకోణంలో అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ ఎలాంటి సాయమూ చేయకపోవడంతో అతన్ని ఏసీబీ ట్రాప్‌లో ఇరికించారనే విమర్శలున్నాయి. అందుకే తాము చెప్పినట్లు చేసే సబ్‌ రిజిస్ట్రార్‌ కావాలని భావించి బుక్కపట్నంలో ఉన్న రామ్మోహన్‌ను ‘దుర్గం’కు తెచ్చుకున్నట్లు సమాచారం. గతంలోనే ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన రామ్మోహన్‌ టీడీపీ నేతలు వేసిన లే అవుట్‌లకు ఎలాంటి రెవెన్యూ అప్రూవల్‌, మున్సిపల్‌ అనుమతులు లేకనే రిజిస్ట్రేషన్లు ఇష్టానుసారంగా చేశారన్న విమర్శలున్నాయి. తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అధికారులు భూ సేకరణ చేపడుతుండడం, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ, ఎన్ని ఎకరాలు ఉన్నాయనే వివరాలను ఇప్పటికే ఎమ్మెల్యే అధికారుల నుంచి సేకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే రామ్మోహన్‌ ఇక్కడికి రావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement