కాపాడబోతే కాటేసింది!
గార్లదిన్నె: విష సర్పాన్ని కాపాడబోయిన ఓ వ్యక్తి చివరకు దాని కాటుకు మృతిచెందాడు. వివరాలు.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన నెట్టికల్లు (57)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కల్లూరులోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం తన ఇంటి సమీపంలోని ఓ ఇంట్లో పాము ఉందని తెలుసుకున్న నెట్టికల్లు.. దానిని కాపాడి సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళుతుండగా కాటేసింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పామిడిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


