జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
గుత్తి: స్థానిక సాయి అకాడమీకి చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు అకాడమీ మాస్టర్ సాయి తేజ మంగళవారం తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరులో ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో గుత్తికి చెందిన కరిష్మ, కీర్తన, పూజిత బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. వీరు నవంబర్‌లో జమ్ముకాశ్మీర్‌లో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు.
31 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించొచ్చు
అనంతపురం సిటీ: ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఈ నెల 31 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్ మంగళవారం తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుముతో నవంబర్ 6వ తేదీలోపు చెల్లించవచ్చని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అమ్మవారి ఆలయంలో త్రిశూలం కూల్చివేత
తాడిపత్రి టౌన్: స్థానిక ఏటిగడ్డ పెద్దమ్మ ఆలయంలో త్రిశూలాన్ని అదే కాలనీకి చెందిన ఓగేటి రంగనాథ్ కూల్చి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. సోమవారం సాయంత్రం రంగనాథ్ ఆలయం వద్దకెళ్లి రోడ్డుకు అడ్డంగా త్రిశూలం ఉందని, కాలనీలోకి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందంటూ ఆలయ కమిటీ సభ్యులను దూషిస్తూ పెకలించి వేశాడన్నారు. ఎస్‌ఐ గౌస్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రంగనాథ్‌ను బైండోవర్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
న్యాయం చేయకుంటే..
ఆత్మహత్య చేసుకుంటా
శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలోని ఇందిరమ్మ కాలనీలో రెవెన్యూ అధికారులు రేకుల షెడ్‌కు ఉన్న పునాదిని తొలగించారని, తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితురాలు నాగలక్ష్మి వాపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అయింది. స్పందించిన తహసీల్దార్ అరుణకుమారి మాట్లాడుతూ.. ఇందిరమ్మ కాలనీలో ఆమె ఉంటున్న స్థలాన్ని మరొకరికి కేటాయించామని, దీనిపై ఆమె దరఖాస్తు చేసుకుంటే, అర్హతను పరిశీలించి మరో చోట ఇంటి స్థలం మంజూరు చేస్తామన్నారు. ఆమె వేసుకున్న స్థలం మరొకరికి ఇచ్చినందున తొలగించాల్సి వచ్చిందన్నారు.
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక


