దుర్గం టీడీపీలో అసమ్మతి మంటలు
● ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ రాష్ట్ర
అధికార ప్రతినిధి
● అమిలినేనిపై మారుతీ చౌదరి గరం గరం
కళ్యాణదుర్గం: నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి జ్వాల రగిలింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వ్యవహార శైలిపై అదే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నం మారుతీ చౌదరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నం హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొని, గెలిచిన అనంతరం ఆ వర్గాన్ని ఎమ్మెల్యే దూరం పెడుతూ వచ్చారు.
ఈ–స్టాంప్ కుంభకోణంపై ఫిర్యాదు
కళ్యాణదుర్గంలో ఇటీవల దుమారం లేపిన ఈ స్టాంప్ కుంభకోణం బయటకు రావడానికి కారణం మారుతీ చౌదరేనని ఎమ్మెల్యే అమిలినేని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఈ క్రమంలోనే కుంభకోణం గురించి మారుతీ చౌదరి అధిష్టానం వద్ద వివరించారని, బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని బ్యాంకర్లను మోసం చేయడంతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే అమిలినేనికి, ఉన్నం కుటుంబ సభ్యులకు మరింత దూరం పెరిగింది.
తాజాగా పెట్రోల్ బంక్ స్థలం వ్యవహారం
తాజాగా పట్టణంలోని కంబదూరు రోడ్డులో మారుతీ చౌదరికి చెందిన నయారా పెట్రోల్ బంకుకు సంబంధించి వివాదం రేగింది. పెట్రోల్ బంకు ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఉసిగొల్పారని, దీంతో రంగంలోకి దిగిన అధికారులు పెట్రోల్ బంకుతో పాటు అక్కడి గదులను కొలతలు వేసినట్లు తెలిసింది. దీనిపై రగిలిపోయిన మారుతీ చౌదరి రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కమిషనర్ వంశీకృష్ణభార్గవ్‌పై చిందులు తొక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపైనా, దాని వెనుక ఉన్న వారిపైనా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పడం సంచలనం కలిగించింది.


