వంక పొరంబోకు స్థలాలతో వ్యాపారం
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 194–8లోని వంక పొరంబోకు స్థలాలతో కొందరు కేటుగాళ్లు వ్యాపారం మొదలుపెట్టారు. ఈ సర్వే నంబరులో మొత్తం 12.05 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల మేరకు ఈ భూమి అంతా వంకపొరంబోకుగా ఉంది. పైగా ఈ భూమి హైకోర్టులో వివాదం ఉంది. ఈ భూమిపై కన్నేసిన ఈడిగ వెంకటేశు, ఇర్ఫాన్, శివశంకర్ తదితరులు పేదలతో అక్రమంగా గుడిసెలు వేయించారు. ఒక్కో గుడిసెకు వేలాది రూపాయలు వసూలు చేశారు. అందరికీ ఫేక్ పట్టాలు ఇచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెళ్లి మాట్లాడారు. వినకపోవడంతో మంగళవారం ఇన్‌చార్జ్ వీఆర్‌ఓ జిలానీ ఆశిక్ ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఈడిగ వెంకటేశు గతంలో ఇలాంటి కేసులోనే రిమాండ్‌కు వెళ్లొచ్చాడు. ఇర్ఫాన్‌పై కూడా కేసులు నమోదైనట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన కొందరు నేతల వీరికి అండగా నిలిచినట్లు తెలిసింది.


