ప్రభుత్వ వేతనం.. ప్రైవేట్ పాఠం
కళ్యాణదుర్గం/అనంతపురం సిటీ: బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం హరికృష్ణ.. కళ్యాణదుర్గంలోని పార్వతీనగర్‌లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ (సైనిక్ స్కూల్, నవోదయ, ఏపీ రెసిడెన్షియల్) నిర్వహిస్తూ జిల్లా విద్యాధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. వాస్తవానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా పనిచేయకూడదనే నిబంధన ఉంది. అయితే అధికార పార్టీని అడ్డుపెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకన్నా విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ అంశం కాస్త వెలుగు చూడడంతో అక్రమార్కుడిని కాపాడే ప్రయత్నంలో టీడీపీ నేతలు తలమునకలయ్యారు.
ఏం జరిగిందంటే..
నవోదయ, సైనిక్, ఏపీఆర్‌జేసీ వంటి పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించిన కోచింగ్ సెంటర్‌ను టీడీపీ నేతల అండతో కళ్యాణదుర్గంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హరికృష్ణ ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేని ఈ సెంటర్‌లో 20 మంది విద్యార్థులను చేర్చుకుని, వారి పేర్లను తమ ప్రభుత్వ పాఠశాలలోని రికార్డుల్లో నమోదు చేయించారు. అయితే ఆ పిల్లలెవరూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకపోయినా.. వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ ఉపాధ్యాయుడు హరికృష్ణనే స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణాధికారిగా డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావును జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్‌బాబు నియమించారు. అయితే విచారణ ప్రక్రియపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ముందస్తుగా సమాచారం అందజేయడంతో రెండు రోజుల క్రితం కోచింగ్ సెంటర్‌కు మూతవేయడమే ఇందుకు నిదర్శనం.
అక్రమార్కుడిని కాపాడేందుకు రంగంలోకి..
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కోచింగ్ సెంటర్ నిర్వహించడమే కాకుండా.. విధులు ఎగ్గొట్టి, బోగస్ అడ్మిషన్లతో ప్రభుత్వ పథకాలను స్వాహా చేయడం వంటి నేరాలకు పాల్పడిన ఉపాధ్యాయుడిని కాపాడేందుకు టీడీపీ నేతలతో పాటు ఓ ఉపాధ్యాయ సంఘం నేతలు రంగంలోకి దిగడం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే డీఈఓ, డిప్యూటీ డీఈఓ కార్యాలయం చుట్టూ రెండ్రోజులుగా వారు చక్కర్లు కొడుతున్నారు. ఈ మొత్తం అక్రమం వెనుక బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాల విద్యాశాఖాధికారుల ప్రమేయమున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోచింగ్ కోసం చేరిన ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఫీజులు వసూలు చేసి ఎంఈఓల చేతులు తడిపినట్లు సమాచారం. ఓ అధికారికి బంగారాన్ని ఎరగా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ యవ్వారం బయటపడకుండా కాపాడుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బ్రహ్మసముద్రం ఎంఈఓ ఓబుళపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. .తమకు విషయం తెలియగానే పాఠశాలలో విచారణ చేపట్టి 9 బోగస్ ఎన్‌రోల్‌మెంట్లుగా గుర్తించామన్నారు. గతంలో ఆరోపణలు వచ్చాయని, వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతుండగా ఒత్తిళ్లు తాళలేకపోయామన్నారు.
విధులు ఎగ్గొట్టి.. ఎంచక్కా
కోచింగ్ సెంటర్ తెరచి..
అధికార పార్టీ అండతో అనుమతులు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు
ఆపై ప్రభుత్వ పథకాలు స్వాహా
చర్యలు తీసుకోకుండా అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి
హరికృష్ణ సస్పెన్షన్
ఉపాధ్యాయుడు హరికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి 10.30 గంటలకు డీఈఓ ప్రసాద్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. హరికృష్ణ అనధికార కోచింగ్ సెంటర్‌పై విచారణ అనంతరం డిప్యూటీ డీఈఓ అందజేసిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ స్పష్టం చేశారు.


